జగన్ ఇపుడు బయటకు చెప్పుకోలేని బాధలలో ఉన్నారు. ఏపీ సీఎం కుర్చీ అన్నది ఆయనకు ముళ్ళ కిరీటంగా మారుతోంది. విపక్షంలో ఉన్నపుడు చంద్రబాబుని ప్రతీ దానికీ డిమాండ్ చేసినట్లు కాదని తెలిసివస్తోంది. ఓ వైపు లోటు బడ్జెట్. ఖజానా ఖాళీ. మరో వైపు కేంద్రం కనీసంగా సాయం చేయని వైనం, ఇంకో వైపు సీబీఐ కేసులు, మరో వైపు తెలంగాణా సీఎం కేసీయార్ తో దోస్తీ, వైరం ఇలా చాలా విషయాల్లో జగన్ ఇబ్బంది పడుతున్నారు. జగన్ బెయిల్ రద్దు అవుతుందా అన్న చర్చ కూడా ఇపుడు జోరుగా వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో అధికారాన్ని అర్జంటుగా కాపాడుకోవాలంటే శరణం కమలం అనాల్సిందే అంటున్నారు.
ఇదే సమయమని బీజేపీ కూడా వైసీపీ మీద తీవ్ర స్థాయిలో వత్తిడిని తీసుకువస్తోంది. కేంద్ర మంత్రి వర్గ విస్తరణను ఈ నెల 7 నుంచి 8వ తేదీకి వాయిదా వేయడం వెనక జగన్ ని ట్రాప్ లోకి లాగాలన్న మోడీ మాస్టర్ ప్లాన్ ఉంది అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ని ఎన్డీయేలోకి చేర్చుకుని కధ మొత్తం ఏపీలో బీజేపీ నడిపించాలని చూస్తోంది. జగన్ మడి కట్టుకుని కూర్చుంటాను అన్నా ఊరుకునేలా సీన్ లేదుట. ఎందుకు ఎన్డీయేలో చేరరు అంటూ దాదాపుగా గద్దించే ధోరణిలోనే బీజేపీ నుంచి వత్తిడి వస్తోందిట.ఎన్డీయేలోకి చేరడానికి వైసీపీకి కూడా పెద్దగా అభ్యంతరాలు లేవు. కానీ ప్రత్యేక హోదా అలాగే ఉండిపోయింది. అదే విధంగా చూసుకుంటే విభజన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు. ఇక ఏపీ నిండా అప్పులు ఉన్నాయి. దీంతో పాటు జనాలకు బీజేపీ మీద కోపం ఎక్కువగా ఉంది. అటువంటి బీజేపీతో అంటుకుంటే కచ్చితంగా తామూ మునిగిపోతామని వైసీపీ ఆలోచిస్తోంది. కానీ మోడీకి జాతీయ స్థాయిలో ప్రతిష్ట అవసరం. ఎన్డీయేలో నుంచి ఒక్కో పార్టీ బయటకు పోతోంది. అలాంటి టైమ్ లో లోక్ సభలో నాలుగవ పెద్ద పార్టీగా ఉన్న వైసీపీని చేర్చుకున్నామని గొప్పగా చెప్పుకోవడానికి ఉంటుంది.
తమ మిత్రుడు అన్న హోదాలో ఏపీలో కూడా బీజేపీకి కొన్ని మంత్రి పదవులు ఇప్పించుకుని రాష్ట్రాధికారం పంచుకున్నట్లు అవుతుంది. దాంతో మోడీ నుంచి భారీ ఎత్తున వస్తున్న వత్తిడికి జగన్ శిబిరం టెంప్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువ అంటున్నారు. దాంతో జగన్ కనుక ఎన్డీయే గూట్లో చేరితే కచ్చితంగా అది టీడీపీ నెత్తిన పాలు పోసినట్లే అంటున్నారు. ఏ మాత్రం చూసుకోకుండా టీడీపీ ఈసారి అధికారంలోకి రావడం ఖాయమని కూడా చెబుతున్నారు. మొత్తానికి మోడీ చేతిలో పావుగా జగన్ మారిపోతున్నరు అంటున్నారు.
Discussion about this post