జగన్ విశాఖ కల అలాగే ఉంది. మూడు రాజధానుల పేరిట జగన్ చేస్తున్న హడావుడి ఆయన సొంత పత్రికలో తప్ప ఎక్కడా పెద్దగా కనిపించడంలేదు. మరో వైపు చూసుకుంటే విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి పరిపాలనా రాజధాని అని వైసీపీ నేతలు ఎప్పటికపుడు ఊదరగొడుతున్నారు కానీ అసలు విషయం వేరుగా ఉంది. విశాఖకు నూటాభై ఏళ్ళ చరిత్ర కలిగిన వాల్తేర్ డివిజన్ కేంద్రం దెబ్బకు మటాష్ అవుతోంది. కొత్తగా రాయగడ డివిజన్ ని ఏర్పాటు చేస్తున్నారు. దాంతో లాభాలు అన్నీ ఆ వైపునకు పోతున్నాయి. విజయవాడ డివిజన్ లో వాల్తేరు లో మిగిలిన ప్రాంతాలను కలుపుతున్నారు. జోన్ తో పాటు వాల్తేర్ డివిజన్ కూడా ఉంచాలని జనాలు కోరుతున్నారు. కానీ జగన్ సర్కార్ మాత్రం ఆ విషయంలో కేంద్రం మీద వత్తిడి తేలేకపోతోంది.
ఇక జగన్ అధికారంలోకి వచ్చాక కొత్తగా పరిశ్రమలు వచ్చిన దాఖలాలు లేవు. అదే సమయంలో ఉన్న వాటికి కూడా కాళ్ళు వచ్చేశాయి. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా కూడా అమ్మేసే పరిస్థితి. ఇలా ప్రైవేట్ కి పోర్టుని దారాదత్తం చేయడం ద్వారా విశాఖకు తీరని అన్యాయమే చేస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. దీనికి మించి అతి పెద్ద ముప్పు విశాఖ ఉక్కు కర్మాగారం రూపంలో ఉంది. విశాఖ ఉక్కు అంధ్రుల హక్కు అని నాడు నినదించి అంత అ కలసి సాధించుకున్నారు. ఇపుడు అది ఎంచక్కా
ప్రైవేట్ పరం అవుతోంది.ఈ విషయంలో కేంద్రంతో గట్టిగా పోరాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసి చేతులు దులుపుకుంది అన్న విమర్శలు ఉన్నాయి. కేంద్రంతో పోరాడి నవరత్నలో ఒకటిగా ఉన్న ఉక్కుని దక్కించుకోవడానికి వైసీపీ సర్కార్ గట్టిగా చేసిన ప్రయత్నాలు లేవన్న మాట ఉంది. వంద రోజులకు పైగా కార్మికులు స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమిస్తున్నా ఎవరికీ పట్టనిది అయింది. ఇదిలా ఉంటే విశాఖ ఉక్కుని ప్రైవేట్ పట్టాలెక్కించేందుకు కేంద్రం మరింత దూకుడు పెంచుతోంది అన్న వార్తలు వస్తున్నాయి.
దాని ప్రైవేటీకరణ మీద ఒక కమిటీని నియమించి కధను సమాప్తం చేస్తారని అంటున్నారు. అంటే జగన్ విశాఖలో కాలు పెట్టకుండానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోతుంది అన్న మాట. మొత్తానికి విశాఖను అభివృద్ధి చేస్తాను అని చెబుతున్న జగన్ సర్కార్ ఇక్కడ ఉన్న కాపాడకుండా చేసేది ఏముంటుంది అన్నదే సగటు జనం ప్రశ్న..!
Discussion about this post