కలం వీరులు అంటారు, అక్షర యోధులు అంటారు. మీరు లేకపోతే మాకు తెల్లారదని రాజకీయ నాయకులు ఎన్నో కబుర్లు చెబుతారు. కానీ తీరా వారికి గట్టి మేలు చేయడానికి మాత్రం చేతులు రావు. పాదయాత్ర వేళ జగన్ ఎన్నో హామీలు ఇచ్చారు. ఎందరికో వరాలు కురిపించారు. ఆయన మూడు వేల ఆరువందల కిలోమీటర్ల పాదయాత్రను ఆద్యంతం కవర్ చేసింది పాత్రికేయులే. వారు కూడా తమ గోడు వెళ్లబోసుకున్నారు. మాకు సొంతింటి కల నెరవేర్చండి అంటే తప్పకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తాను అని నాడు జగన్ హామీ ఇచ్చారు. మూడు సెంట్ల స్థలం ఇచ్చి చక్కనైన ఇళ్ళు జర్నలిస్ట్ మిత్రులకు ఇప్పిస్తామని కూడా గట్టిగానే చెప్పారు.
జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతోంది. కానీ కనీసం అక్రిడేషన్లకే దిక్కు లేదు. ఇక హెల్త్ కార్డుల ఊసు లేదు. ఇపుడు ఇళ్ళ హామీని కూడా ఎగరగొట్టేందుకు సర్కార్ రెడీ అవుతోందా అన్న డౌట్లు వస్తున్నాయి. మాకు కూడా ఇళ్ళు నిర్మించి ఇవ్వండి అంటూ గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాధరాజును జర్నలిస్టులు తాజాగా కోరితే ఆయన ఇచ్చిన సమాధానం దిమ్మతిరిగేలా ఉంది. జర్నలిస్టులకు మూడు సెంట్ల స్థలం ఇస్తామని వైసీపీ చెప్పింది కదా అని అడిగితే అటువంటి పాలసీ ఏదీ మా ప్రభుత్వం వద్ద లేనే లేదు అంటూ రాజు గారు షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు.అంటే జర్నలిస్టులకు ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని ఈ రోజు వరకూ ప్రభుత్వం ఏమీ అనుకోవడం లేదని ఆయన చెప్పేశారు అన్న మాట. పైగా పేదలందరికీ ఇచ్చిన మాదిరిగానే పట్టణాలలో అయితే సెంటు, గ్రామాలలో అయితే సెంటున్నర స్థలం ఇస్తామని, ఆ విధంగా పేదలు ఎవరైనా ఉంటే ఆ జర్నలిస్టులకు ఈ పధకంలో కలిపి ఇళ్ళు ఇస్తామని చెబుతున్నారు. అంటే జర్నలిస్టులను ఒక కేటగిరీగా గుర్తించి గౌరవించడానికి ప్రభుత్వం సిధ్ధంగా లేదు అన్నది రాజు గారి మాటల ద్వారా వెల్లడి అవుతోంది.
జగన్ హామీ ఎక్కడ ఉంది అంటే అటకెక్కింది అనుకోవాలేమో. మా పాలసీయే అది కాదు అని సర్కార్ వైఖరి చెప్పాక ఇక పెన్నన్నలకు నోటి వెంట మాట వస్తుందా. మొత్తానికి జర్నలిస్టులు కరివేపాకులు అని వైసీపీ సర్కార్ పెద్దలు తీసి అవతల పారేస్తున్నారు అన్న మాటేగా అని యూనియన్ నాయ్కులు గుర్రుమంటున్నారు.
Discussion about this post