తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలకు కష్టాలు పెరుగుతున్నాయి. అధినేత చంద్రబాబు..భవిష్యత్‌లో లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలనే నేపథ్యంలో పార్టీ యువ నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే క్రమంలో యువ నేతలకు 40 సీట్లు ఇస్తామని అంటున్నారు. ఇప్పటికే పలు స్థానాల్లో యువ నేతలకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అలాగే కొందరు సీనియర్లకు సీట్ల విషయంలో ఇబ్బందులు పెరిగాయి. ఇదే క్రమంలో సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ ఫ్యామిలీకి సీట్ల విషయంలో క్లారిటీ లేదు.

జగ్గంపేట సీటు బాధ్యతలు జ్యోతుల ఫ్యామిలీనే చూసుకుంటుంది. కాకపోతే జ్యోతుల ఫ్యామిలీ కాకినాడ ఎంపీ సీటు కూడా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కాకినాడ ఎంపీ సీటు తన తనయుడు నవీన్‌కు ఇప్పించుకోవాలని జ్యోతుల చూస్తున్నారు. ఎలాగో కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడుగా నవీన్ ఉన్నారు. ఆ పరిధిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. పైగా పార్లమెంట్ లో టీడీపీకి నాయకుడు లేరు. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున చలమలశెట్టి సునీల్ పోటీ చేసి ఓడిపోయారు.

ఆ తర్వాత ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో కాకినాడ పార్లమెంట్ లో టీడీపీకి నాయకుడు లేరు. దీంతో ఆ సీటుని నవీన్ ఆశిస్తున్నారు. ఎలాగో కాకినాడ పార్లమెంట్ పరిధిలో కాపు ఓటర్లు ఎక్కువ. ఇటు జ్యోతుల ఫ్యామిలీ కాపు వర్గానికే చెందినది. అయినా సరే బాబు ఈ సీటు విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు. ఎలాగో ఒక ఫ్యామిలీకి ఒకటే సీటు అని అంటున్నారు.

దీంతో జ్యోతుల ఫ్యామిలీకి జగ్గంపేట సీటు ఇచ్చి..కాకినాడ ఎంపీ సీటుని మరొక నేతకు ఇచ్చే ఛాన్స్ ఉంది. లేదా జనసేనతో పొత్తు ఉంటే ఆ సీటుని జనసేనకు కేటాయించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మరి చూడాలి బాబు నిర్ణయం ఎలా ఉంటుందో.
