మాట విసరడం సులువు. కానీ అవతల వారి పొజిషన్ లో మనమే ఉంటే అది ఎంత కష్టమో తెలుసుకుంటే ఆ మాట విసుర్లు ఉండవేమో. చిటికలో ప్రత్యేక హోదా తెస్తాను అని నాడు ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్ తరచూ అనేవారు. ఏపీకి సంబంధించి ఏ డిమాండునూ కేంద్రం నుంచి చంద్రబాబు సాధించడంలేదు అని కూడా ఆయన విమర్శల జడివాన కురిపించేవారు. కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేకపోతున్నారు అని కూడా నిందించేవారు. కానీ ఇపుడు జగన్ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాక రెండున్నరేళ్ళు అవుతున్న వేళ బాబు ఎంత క్రిటికల్ పొజిషన్ లో నాడు ఉండేవారో ఈపాటికి అర్ధమయ్యే ఉంటుంది. కేంద్రంలో ఉన్నది మోడీ. ఆయనకు చంద్రబాబు అయినా జగన్ అయినా తేడా లేదని కూడా యువ ముఖ్యమంత్రికి అర్ధం అయి ఉంటుంది.

సరే ఉన్నంతలో చంద్రబాబే కేంద్రాన్ని గట్టిగా అడిగి కొద్దో గొప్పో ఏపీకి నిధులు తీసుకువచ్చారు అని చెప్పాలి. పోలవరం కూడా ఆయన హయాంలోనే స్టార్ట్ అయింది. అమరావతి రాజధానికి కేంద్రం నాడు రెండున్నర వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది. ఇక ప్రత్యేక హోదా లేకపోయినా ప్యాకేజి అంటూ బాబు పట్టుకువచ్చారు. కానీ జగన్ హయాంలో ఇవేమీ లేవు కదా. బాబు జగన్ డిమాండ్ కి తలొగ్గి ప్యాకేజిని వదులుకున్నారు. ఆ విధంగా చూస్తే హోదా పాపమే కాదు, ప్యాకేజ్ ని పోగొట్టిన పాపమూ నేరమూ కూడా జగన్ దే అవుతుందేమో.

ఇక కేంద్రం వద్ద నాడు చంద్రబాబు కానీ టీడీపీ ఎంపీలు కానీ తరచూ కొత్త డిమాండ్లూ పెడుతూ ఏపీకి నికరంగా సాధించుకునేవారు. బాబు గురించి అప్పటి అధికారులు కూడా ఒక మాట అనేవారు. కేంద్రం వద్ద ఇన్ని పధకాలు ఉంటాయని, ఆ నిధులు రాష్ట్రాలకు ఎలా తెచ్చుకోవచ్చు అన్నది కూడా తమకు అసలు తెలియదు అనేవారు. బాబు మాత్రం చాలా జాగ్రత్తగా అన్నీ గమనిస్తూ కేంద్రం నుంచి నిధులు ఎక్కువగానే నాడు తెచ్చుకున్నారు. ఒక రూపాయి ఎక్కువే వచ్చింది తప్ప తక్కువ లేదు. దానికి పాలనానుభవం కావాలి.

నాడు బాబుతో పాలించిన ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా ఈ విషయంలో వెనకబడిపోయారు అనే చెప్పాలి. అటువంటి బాబు విషయంలో జగన్ సహా విపక్షాలు చేసిన ప్రచారం మూలంగా ఏపీకి ఇపుడు తీరని నష్టమే వాటిల్లింది అంటున్నారు. ఇక జగన్ కేంద్రం నుంచి అవమానాలు భరిస్తున్నా లేక నిధులు తేలేకపోతున్న ఎవరినీ అనాల్సిన పని కూడా లేదనే మాట వినిపిస్తోంది. మొత్తానికి జగన్ కి బాబుకూ తేడా కూడా ఏపీ జనాలకే కాదు, ఢిల్లీ పెద్దలకూ అర్ధమవుతోంది.
Discussion about this post