కేవీపీ రామచంద్రరావు వైఎస్సార్ నీడగా చెప్పుకునే వారు. ఆయన ఆత్మగా కూదా భావించేవారు. వైఎస్సార్ తో ఆయన అనుబంధం కర్నాటకలోని మెడికల్ కాలేజీ విద్యార్ధిగా మొదలైంది. అది వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలు అయ్యేంతదాకా కొనసాగింది. మొదట్లో ఇద్దరూ వైద్య విద్యను అభ్యసించే సహాధ్యాయిలు. ఆ తరువాత ప్రజా వైద్యులు. ఆ తరువాత ఇద్దరూ కలసి ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ లో చరిష్మాటిక్ లీడర్ గా ఉంటే ఆయన వెనక ఉండి సిసలైన రాజకీయ వ్యూహాలను రూపొందించిన నేతగా, ఆత్మగా కేవీపీ ఉండేవారు.
వైఎస్సార్ ప్రజా ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవడం వెనక కేవీపీ పాత్ర కూడా ఎంతో ఉందని చాలా మంది చెబుతారు. మరి జగన్ కి కూడా తండ్రి ఉన్న రోజుల్లో కేవీపీతో చక్కని అనుబంధం ఉండేది. మామా అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. అలాంటి కేవీపీకి జగన్ కి ఎక్కడో తేడాలు వచ్చాయి. బహుశా తాను కాంగ్రెస్ ని వీడి వచ్చేస్తే కేవీపీ మాత్రం ఆ పార్టీని వదలకుండా ఈ రోజుకీ ఉండడం జగన్ కి బాధ కలిగించింది అంటారు. అంతే కాదు తనను కాంగ్రెస్ అన్నేసి బాధలు పెడుతూంటే కేవీపీ హై కమాండ్ వద్ద తన పలుకుబడి ఉపయోగించి రక్షించే విధంగా కృషి చేయలేదు అన్న ఆవేదన ఉంది అంటారు. వీటికి మించిన ఆర్ధిక రాజకీయ లావాదేవీల విషయంలో కూడా ఇద్దరికీ గొడవలు వచ్చాయని ప్రచారంలో ఉంది.మొత్తానికి జగన్ ది ఒంటరి ప్రయాణం. ఆయన వెంట వైఎస్సార్ మిత్రులు ఎవరూ లేరు. వారి సంగతి పక్కన పెడితే ఆత్మ లేకపోవడం మాత్రం దారుణమే. మరి ఇంతలా మామా అల్లుళ్ళ మధ్య విభేదాలు రావడం మాత్రం రాజకీయాల్లో చర్చకు ఎపుడూ తావిస్తూనే ఉంటుంది. జగన్ కి ఎంతో మంది సలహాదారులు ఉన్నారు. కానీ వైఎస్సార్ కి కేవీపీ దొరికినట్లుగా ఒక్కరూ లేరు అన్న మాట అయితే ఉంది.
ఒక్క కేవీపీ చాలు అన్నట్లుగా ఉండే పరిస్థితిని కోరి జగన్ దూరం చేసుకున్నారా లేక ఆత్మ దూరంగా వెళ్ళిందా అన్నది ఎవరికీ తెలియని బోధపడని విషయమే. ఏది ఏమైనా అధికారన్ని జగన్ సంపాదించుకున్నారు కానీ మరో కేవీపీని మాత్రం తెచ్చుకోలేకపోయారు అన్న చర్చ అయితే అంతటా ఉంది మరి.
Discussion about this post