శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీడీపీ వచ్చాక ఇక్కడ గెలుపు మరో పార్టీకి దక్కిన సందర్భం తక్కువ. 1983 నుంచి 2019 వరకు చూసుకుంటే టెక్కలిలో టీడీపీదే హవా. మధ్యలో రెండుసార్లు కాంగ్రెస్ టెక్కలిలో గెలిచింది. 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఇక టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ సైతం 1994 ఎన్నికల్లో ఇక్కడ నుంచే పోటీ చేసి విజయం సాధించారు.అయితే ఇంతవరకు ఇక్కడ వైసీపీకి విజయం దక్కలేదు. గత రెండు పర్యాయాలు నుంచి ఇక్కడ అచ్చెన్నాయుడుదే హవా. గతంలో మూడుసార్లు హరిశ్చంద్రపురం(నియోజకవర్గాల పునర్విభజనకు ముందు) నుంచి గెలిచిన అచ్చెన్న తొలిసారి టెక్కలి బరిలో 2009లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో అచ్చెన్న సత్తా చాటారు. ఇక గతంలో చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమయ్యాక అచ్చెన్న ఎలాంటి దూకుడు ప్రదర్శిస్తున్నారో తెలిసిందే. ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా పనిచేస్తున్న అచ్చెన్న, రాష్ట్ర స్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మధ్యలో ఈయనని వైసీపీ ప్రభుత్వం ఈఎస్‌ఐ స్కామ్‌లో జైల్లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఎలాంటి అక్రమాలు జరగకపోయిన, కక్షపూరితంగానే అచ్చెన్నని జైల్లో పెట్టారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి.జైలు నుంచి బయటకొచ్చాక అచ్చెన్న దూకుడుగా ముందుకెళుతున్నారు. తన సొంత నియోజకవర్గం టెక్కలిలో మరింత బలపడినట్లు తెలుస్తోంది. ఇటీవల పంచాయితీ ఎన్నికల్లో అచ్చెన్నని దెబ్బకొట్టాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నించింది. ఆయన సొంత గ్రామంలో వైసీపీ జెండా ఎగరవేయాలని వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ చేసిన హడావిడి అందరికీ తెలిసిందే. కానీ ఎన్ని చేసిన అచ్చెన్నకు వైసీపీ చెక్ పెట్టలేకపోయింది. అచ్చెన్న సొంత వూరులో టీడీపీ భారీ మెజారిటీతో గెలిచింది. అటు నియోజకవర్గంలో పలు పంచాయితీల్లో టీడీపీ సత్తా చాటింది.
అయితే దువ్వాడ నోటి దురుసు, వైసీపీకే డ్యామేజ్ జరిగేలా చేసిందని తెలుస్తోంది. అలాగే అక్కడ దువ్వాడ అక్రమాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దువ్వాడ అనుచరులు పెత్తనం చెలాయించడాన్ని టెక్కలి ప్రజలు సహించడం లేదని తెలుస్తోంది. అందుకే ఇక్కడ ప్రజలు ఇంకా అచ్చెన్నకే ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ అచ్చెన్నని నిలువరించడం వైసీపీకి సాధ్యం కాదనే అంటున్నారు.
Discussion about this post