జగన్ కి వెన్నుదన్నుగా ఉన్న రాజకీయ కుటుంబాలు ఒక్కోటీ ఇపుడు విరక్తిగా పక్కకు జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా రాయలసీమలో ఎన్నో ప్రముఖ కుటుంబాలు ఉన్నాయి. వారి అండదండలే ఏ పార్టీనైనా విజయం సాధించేలా చేస్తాయి. అంతా తామేనని ఏ పార్టీ అధినాయకుడు అనుకున్నా కూడా అది ఉత్త భ్రమ అనే అనుకోవాలి. జగన్ కి ఎంత ప్రజాదరణ ఉన్నా కూడా లోకల్ గా పట్టున్న నాయకులు కూడా కలసిరావాలి కదా. ఇవన్నీ ఇలా ఉంటే కర్నూల్ జిల్లాలో శిల్పా ఫ్యామిలీకి ఎంతో పలుకుబడి ఉంది. ఆ కుటుంబం చాలా కాలంగా రాజకీయాల్లో ఉంది. శిల్పా మోహన్ రెడ్డి వైఎస్సార్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు.

ఆయన సోదరుడు చక్రపాణిరెడ్డి కూడా సీనియర్ నేత. ఇక శిల్పా మోహనరెడ్డి 2017లో నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికల్లో భూమా ఫ్యామిలీకి ఎదురుగా వైసీపీ తరఫున నిలబడి ఓడిపోయారు. ఆ తరువాత రాజకీయాలకు స్వస్తి అని ఆయన చెప్పేశారు. 2019 ఎన్నికల్లో ఆయన కుమారుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పోటీలో నిలబడి గెలిచారు ఆయన సతీమణి శిల్పా నాగినీరెడ్డి కూడా రాజకీయాలలో ఆసక్తిని చూపించారు. ఆమె ఈ మధ్య జరిగిన నంద్యాల మునిసిపాలిటీ ఎన్నికల్లో చైర్ పర్సన్ అవుదామనుకుని వార్డు కౌన్సిలర్ గా పోటీకి దిగారు.ఆమె గెలిచినా జగన్ సామాజిక సమీకరణల నేపధ్యంలో చైర్మన్ పదవిని మైనారిటీలకు ఇచ్చేశారు. ఆ తరువాత వైస్ చైర్మన్ పదవి అయినా తమ ఫ్యామిలీకి వస్తుందని ఆశిస్తే అది కూడా బలిజ సామాజికవర్గానికి కేటాయించారు. ఇపుడు రెండవ వైస్ చైర్మన్ పదవిని కూడా బీసీలకు కేటాయించడంతో శిల్పా ఫ్యామిలీకి గట్టి షాక్ తగిలిందిట. తాము పార్టీకి ఇంత సేవ చేస్తున్నా జగన్ కనీసం వైస్ చైర్మన్ పదవి అయినా ఇవ్వలేదు అని వారు మధనపడుతున్నారుట. ఈ మధ్యనే రవిచంద్ర కిషోర్ రెడ్డి బాబాయ్.

వైసీపీ ఎమ్మెల్యే అయిన శిల్పా చక్రపాణీరెడ్డి కూడా జగన్ సర్కార్ మీద హాట్ కామెంట్స్ చేసిన సంగతి విధితమే. క్రిష్ణా జలాల విషయంలో ప్రభుత్వ తీరు బాగాలేదు అనంట్లుగానే ఆయన మాటలు ఉన్నాయి. రాయలసీమకు అన్యాయం జరుగుతోందని కూడా ఆయన అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే జగన్ పోకడల మీద రాయలసీమ రెడ్లు, బలమైన రాజకీయ కుటుంబాలు అసంతృప్తితోనే ఉన్నాయని అంటున్నారు.
Discussion about this post