ఆయన యువ నేత, టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఆయన కు కలిసివస్తున్న పరిణామాలు మాత్రం కనిపించడం లేదు. దీంతో ఒంటరి పోరుతోనే ముందుకు సాగాల్సి వస్తోంది. ఆయనే కడప జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు.. మారంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఉరఫ్ బీటెక్ రవి. టీడీపీ యువ నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే పార్టీ తరఫున గట్టివాయిస్ వినిపిస్తున్నారు. అయితే.. కొన్నాళ్లుగా.. పార్టీ పరిస్థితి ఇబ్బందిగా మారింది. జిల్లాకు చెందిన నాయకులు చాలా మంది పార్టీ మారిపోయి.. బీజేపీలోకి చేరిపోయారు.

ముఖ్యంగా ఒకప్పుడు బలమైన వాయిస్‌వినిపించిన సీఎం రమేష్.. ఆదినారాయణ రెడ్డి వంటివారు.. టీడీపీకి దూరంగా ఉంటు న్నారు. ప్రస్తుతం వారు బీజేపీ నాయకులుగా చలామణి అవుతున్నారు. ఈ క్రమంలో బీటెక్ రవికి.. మద్దతుగా నిలిచే వారు కనిపించడం లేదు. అయితే.. పార్టీ అధిష్టానం నుంచి మాత్రం రవికి బాగానే మద్దతు ఉంది. దీంతో వైసీపీ సర్కారుపై రవి.. తీవ్రస్థా యిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటిదో కేసును బయటకు తోడిన వైసీపీ సర్కారు.. ఆయనను జైలుకు కూడా తరలించింది. తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాక కూడా ఆయన దూకుడు తగ్గలేదు.

ఇక, శాసన మండలిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. లోకేష్‌పై మంత్రి వెలంపల్లి దాడి చేశారని నిరసిస్తూ.. తన పదవికి రాజీనామా చేశారు. అయితే.. ఇది ఆమోదం పొందలేదు. ప్రస్తుతం రవి ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని.. కడపలో పాగా వేసేలా.. తన సత్తా చూపించాలని అనుకుంటున్నారు.ఎందుకంటే.. ఒకప్పుడు కష్టపడినా.. ఆ ఫలితం.. సీనియర్ నేతల ఖాతాల్లోకి వెళ్లిపోయేదనే భావన ఉంది. కానీ, ఇప్పుడు.. రవి ఖాతాలోనే పడనుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే.. రవి దూకుడు రాజకీయాలు చేస్తున్నారు.

తాజాగా సీమ ప్రాంతాన్ని ఫ్యాక్షన్ చేశారని.. వ్యక్తుల మధ్య రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారని.. పేర్కొంటూ.. ముఖ్యమంత్రి జగన్‌కు రవి లేఖ సంధించారు. ముఖ్యమంత్రిగా జగన్ వచ్చిన తర్వాత.. సీమలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయం పెరిగిందని.. రవి ఆరోపించారు. ఇక, జిల్లాలో టీడీపీ నేతలను కలిసేందుకు కూడా రవిప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే కడప ఉక్కు కర్మాగారం.. సహా.. సాగు , తాగు నీటికి సంబంధించి.. ఆయన ఉద్యమించాలని నిర్ణయించుకున్నారు.

వచ్చే రెండేళ్లు కూడా ఎన్నికల నామ సంవత్సరం కాబట్టి.. దానికి తగిన విధంగా రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. క్షేత్రస్థాయిలో కలిసివచ్చే నేతలే.. ఇప్పుడు రవికి ఇబ్బందిగా మారారు. ఎవరూ రాకుండా.. మద్దతివ్వకుండా.. ఎలా ముందుకు సాగాలి? ఏవిధంగా పార్టీని బలోపేతం చేయాలి? అనేవి ఇప్పుడు రవిముందున్న ప్రశ్నలు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Discussion about this post