ఏపీ సీఎం జగన్ కేబినెట్‌లో కలకలం రేగింది. ఇద్దరు మంత్రులు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తారంటూ.. పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో ఇది.. వైసీపీ నేతల మధ్య హాట్ టాపిక్‌గా మారి.. సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతుండడం గమనార్హం. ఇటీవల కాలంలో మంత్రులకు ప్రాధాన్యం తగ్గిపోయింది. ముఖ్య సలహాదారు, లేదా.. పార్టీ రాజ్యసభ సభ్యులకు జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారు. వీరిలోనూ.. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారికి .. ఎనలేని అధికారాలు కట్టబెట్టారు. దీంతో వారు రెచ్చిపోతున్నారు. ఉత్తరాంధ్రలో సాయిరెడ్డి దూకుడు ఎలా ఉందో అందరికీ తెలిసిందే.
ఇక, గుంటూరు, ప్రకాశం, కృష్నాజిల్లాల్లో కీలక సలహాదారు.. సజ్జల కూడా అంతే రేంజ్‌లో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులకు కూడా ప్రాధాన్యం తగ్గిపోయి.. మీడియా మీటింగులు పెట్టినా.. మరే కార్యక్రమం పెట్టినా.. వీరిదే పైచేయిగా మారుతోంది. ఈ క్రమంలోనే ఇద్దరు మంత్రులు స్వచ్ఛందంగానే మౌనం పాటిస్తున్నారు. వీరిలో గోదావరి జిల్లాకు చెందిన మంత్రి ఒకరు ఉండగా.. కోస్తా జిల్లాకు చెందిన మహిళా మంత్రి ఉన్నారు. వీరిద్దరూ కూడా ఇటీవల కాలంలో చాలా సైలెంట్ అయ్యారు. గోదావరి జిల్లాలకు చెందిన ఆ మంత్రికి మరింత అవమానాలు జరుగుతున్నాయని.. పార్టీలోనే ప్రచారం సాగుతోంది.ఇటీవల నామినేటెడ్ పదవుల విషయంలో ఆయన చేసిన సిఫారసులను సజ్జల పూర్తిగా పక్కన పెట్టారు. పైగా ఆయనను అసలు పట్టించుకోలేదు. అక్కడ రెడ్డి వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో హర్టయిన ఆ మంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఈ పరిణామంతో ఆయనే స్వచ్ఛందంగా తప్పుకొంటారనే ప్రచారం సాగుతోంది. ఇక కీలక శాఖకు చెందిన మహిళా మంత్రికి ప్రాధాన్యం తగ్గుతోందనే ప్రచారం ఇటీవల కాలంలో పెరుగుతోంది. ముఖ్యంగా ఆయన చేయాల్సిన పనులను కూడా సలహాదారు చేస్తుండడం.. ఆమెకు నచ్చడం లేదు.
దీంతో ఆమె సామాజిక వర్గం నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. పార్టీపైనా.. అధినేత పైనా విశ్వసనీయత ఉన్నప్పటికీ.. మంత్రిగా బయటకు వెళ్తే.. ఏ కార్యక్రమంలోనూ ప్రాధాన్యం లభించకపోవడం.. ఆమెకు తీవ్ర ఇబ్బందిగా ఉందని.. అందుకే స్వచ్ఛందంగా తప్పుకొనేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ ప్రచారం వెనుక.. ఏదైనా.. వ్యూహం ఉందా? లేక వారే నిజంగా నిర్ణయం తీసుకున్నారా? అనేది చూడాల్సి ఉందని అంటున్నారు పరిశీలకులు. దీనిపై వైసీపీలోనూ చర్చ సాగుతుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Discussion about this post