ఒక చేత్తో పంచుడు మరో చేత్తో దంచుడు. ఇలా సాగుతోంది జగన్ రెండేళ్ళ పాలన. జగన్ అధికారంలోకి రాక ముందు నేలబారుగా ఉండే నిత్యావసరాల ధరలు అన్నీ కూడా ఇపుడు ఒక్కసారిగా చుక్కలను అంటుకున్నాయి. ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్ట్లు లేదు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. దీని మీద ఏపీలోని సర్వత్రా జనాలు గగ్గోలు పెడుతున్నారు. మరో వైపు వైసీపీ సర్కార్ తాము సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నామని, జనమంతా హాయిగా బతికేస్తున్నారు అన్న భ్రమల్లో ఉంది. కానీ నిజానికి గత రెండేళ్ళల్లో ఇంతకు మూడింతలుగా నిత్యావసర ధరవరలు పెరిగాయి. పప్పూ ఉప్పూ కూడా సామాన్యుడికి అంతనంత ఎత్తుకు పోయింది. దాంతో సగటు జీవి కష్టాలు చెప్పనలవి కాదు.
దానికి తోడు కరోనా టైమ్ లో ఉపాధి రంగం దెబ్బ తింది. జనాలకు పని లేదు. ప్రభుత్వం దీనికి తోడు అన్నట్లుగా అన్ని రకాల పన్నులు నెత్తిన వేసి చితకబాదుతోంది. ఆఖరుకు పరిస్థితి ఎంతదాకా వచ్చిందంటే చెత్తకు కూడా పన్ను వేస్తూ సామాన్యుడి జేబులో చేయి పెడుతున్నారు. ఇక ఆస్తిపన్నును విలువ ఆధారితంగా మార్చడంతో అది తడిసి మోపెడు అవుతుంది అంటున్నారు. ఇంటి యజమానులకు ఈ పన్ను బాదుడు పడితే వారు చక్కగా తీసుకువచ్చి అద్దెకు ఉండేవారికి బదలాయిస్తున్నాడు.దాంతో ఏ విధంగా చూసినా సామాన్యులు, మధ్యతరగతి వర్గాలు ఈ పన్నుల దెబ్బకు బలి అవుతున్నారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే పెట్రోల్ డీజిల్ ధరలు సెంచరీలు కొట్టేశాయి. ఒకపుడు పేదవాడి వాహనం సైకిల్ అయితే ఇపుడు మోటారు సైకిల్ అయింది. దాంతో పెట్రోలు భారాన్ని భరించలేక చిరు జీవులు అల్లల్లాడుతున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు ఇంతలా పెరిగిపోతున్నా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం పట్ల కూడా జనంలో అసహనం వ్యక్తం అవుతోంది. నాడు విపక్షంలో ఉన్నపుడు పెట్రోల్ ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పన్నులు తగ్గించుకోవాలని నీతులు చెప్పిన జగన్ ఇపుడు ఏం చేస్తున్నారు అని మేధావులు ప్రశ్నిస్తున్నారు.
జగన్ సర్కార్ ఆ పన్నులు తగ్గించుకుంటే ఏపీలో చవకగా పెట్రోల్ దక్కుతుంది కదా అంటున్నారు. ఇక వంట నూనె సలసల మరుగుతోంది. పప్పులు కూడా దారుణంగా రేట్లు పెంచుకున్నాయి. సంక్షేమ ఫలాలు అంటున్నారు కానీ అవి అందరికీ అందడం లేదు. బాదుడు దంచుడు మాత్రం పేదలతో సహా అందరికీ ఒకేలా దెబ్బ ఉంది. జగన్ సర్కార్ ఈ విషయంలో పట్టించుకుని ధరలను అదుపు చేయకపోతే మాత్రం ఈ రోజు దంచుడుకి తగిన బదులు 2024లో గట్టిగా ఇచ్చేందుకు జనాలు రెడీగా ఉన్నారని అంటున్నారు. మొత్తానికి జగన్ పాలన పట్ల మాత్రం ఒక్కసారిగా వ్యతిరేకత పెరుగుతోంది.
Discussion about this post