ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కీలక నాయకుడు, ఒకప్పుడు ఉత్తరాంధ్ర ఉద్యమం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న కొణతాల రామకృష్ణ.. ఇప్పుడు రాజకీయంగా ఒంటరయ్యారా? ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదా? అంటే.. ఔననే అంటున్నారు. ఒకప్పుడు.. రామకృష్ణకు మంచి ఫాలోయింగ్ ఉండేది. ముఖ్యంగా టీడీపీలో ఉన్నప్పుడు.. ఆయనకు మంచి గుర్తింపు కూడా ఉండేది. అయితే.. తర్వాత కాంగ్రెస్‌లోకి మారడం.. ఆ వెంటనే వైసీపీలోకి జంప్ చేయడం.. అక్కడ కూడా నిలకడైన రాజకీయాలు చేయలేక పోవడంతో రామకృష్ణకు ఇప్పుడు ప్రజల్లోనూ గుర్తింపు లేకుండా పోయింది.

ఇటీవల రామకృష్ణ కుటుంబం ఆధ్వర్యంలో ఉన్న అన్నవరం దేవస్థానం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో రామకృష్ణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. ఆయనకు మద్దతుగా ఏ ఒక్కరూ గళం విప్పలేక పోయారు. కానీ, కొన్నాళ్ల కిందట అంటే.. 2019 ఎన్నికలకు ముందు వరకు కూడా .. రామకృష్ణ పిలుపునకు ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి నాయకుడు కూడా కదిలి వెళ్లేవారు. కానీ, ఇప్పుడు ఆయన సొంత సమస్యను కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనికి రామకృష్ణ చేసుకున్న స్వయంకృతమే కారణమని అంటున్నారు పరిశీలకులు.

దీనికి తోడు జగన్ సైతం 2014 ఎన్నికల వేళ ఆయనకు విపరీతమైన ప్రయార్టీ ఇచ్చి ఆ తర్వాత పక్కన పెట్టేశారు. అది తట్టుకోలేకే గత ఎన్నికలకు ముందు.. వైసీపీకి దూరమైన ఆయన.. మళ్లీ ఎన్నికల సమయంలో వైసీపీకి చేరువయ్యారు. అయితే.. ఏమైందో ఏమో.. వైసీపీలో తిరిగి చేరలేదు. అప్పటి నుంచి మౌనంగా ఉంటున్నారు. అయితే.. రామకృష్ణ వస్తే.. పార్టీలో చేర్చుకుంటామంటూ.. ఏడాది కిందట.. ఎన్నికల తర్వాత.. చంద్రబాబు వర్తమానం పంపారు. కానీ,ఆయన మౌనంగానే ఉన్నారు. ఇక, కాంగ్రెస్ ఇప్పట్లో పుంజుకునే పరిస్థితి లేకుండా పోయింది.

ఈ పరిణామాలే ఇప్పుడు రామకృష్ణకు పెద్ద మైనస్‌గా మారాయి. ఒకప్పుడు వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అటు విశాఖ జిల్లా రాజకీయాలతో పాటు ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించిన కొణతాల రామకృష్ణ వేసిన అడుగులు ఆయనకు మైనస్‌గా మారాయని చెబుతున్నారు. మరి ఇకనుంచైనా ఆయన మారతారో.. లేక రాజకీయంగా తెరమరుగు అవుతారో ? చూడాలి.
Discussion about this post