ఏపీ సర్కార్ ఇపుడు అప్పులలో ఉంది. అప్పు చేసుకుంటేనే తప్ప పూట గడవదు అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అప్పులలో ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి బాహాటంగానే ప్రకటించారు. దాంతో వడ్డీ ఎంత అయినా ఫరవాలేదు, అప్పులు ఇవ్వండి మహాప్రభో అంటూ అడుగుతున్న దాఖలాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఏపీ సర్కార్ అప్పు కోసం ప్రపంచ బ్యాంక్ షరతులకు తలొగ్గిందంటూ తెలుస్తోంది. అదెలా అంటే ఏపీలో ఉపాధ్యాయ నియామకాలకే అడ్డుపడేలాగనట. అంటే ఈ అప్పు తీర్చేంతవరకూ ఏపీలో ఉపాధ్యాయ నియామకాలు ఉండవనే అంటున్నారు.

ఇంతకీ విషయం ఏంటి అంటే వైసీపీ ప్రభుత్వం సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్‌స్ఫర్మేషన్(సాల్ట్) ప్రాజెక్టును ఏపీలో అమలు చేస్తోంది. దీని ద్వారా ఉపాధ్యాయులలో వృత్తి నైపుణ్యాన్ని పెంచడం, ఆంగ్ల బోధనను ప్రవేశపెట్టడం వంటి వాటికి ఈ నిధులను ఖర్చు చేస్తారు. వీటి కోసం కావాల్సిన నిధులను 1900 కోట్ల ద్వారా ప్రపంచ బ్యాంక్ ఏపీ ప్రభుత్వానికి ఇస్తోంది. అయితే దానికి గానూ ప్రపంచ బ్యాంక్ ఒక చిత్రమైన షరతు పెట్టిందట. ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల నియామకాలను చేపట్టకూడదు అని. దానికి అంగీకరించడం ద్వారా ఏపీ సర్కార్ ఉపాధ్యాయ నిరుద్యోగుల ఆశలను పూర్తిగా గండికొట్టేసిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఏపీలో ఆరు అంచెల నూతన విద్యా విధానం ప్రవేశపెట్టడం వెనక కూడా కొత్తగా టీచర్ పోస్టులను భర్తీ చేయకూడదు అన్న ఉద్దేశ్యం ఉందని అంటున్నారు. అయితే ఏపీలో ప్రేతీ రెండేళ్ళకు ఒకసారి డీఎస్సీ నిర్వహించి పోస్టులను భర్తీ చేయడం ఇప్పటిదాకా వస్తోంది. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇది అమలు అవుతోంది.నాడు టీడీపీ కూడా రెండు సార్లు డీఎస్సీ నిర్వహించి వేలాదిగా పోస్టులను భర్తీ చేసింది. ఇపుడు ఏపీలో దాదాపుగా పాతిక వేల దాకా ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. కానీ కనీసం వాటి భర్తీ గురించి వైసీపీ సర్కార్ ఆలోచించడంలేదు. ఇక మీదట కూడా ఆలోచించదు అనడానికి ప్రపంచ బ్యాంక్ షరతులు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి కాబోయే గురువులకు వైసీపీ సర్కార్ పంగనామాలు పెడుతోంది అంటున్నారు.
Discussion about this post