సాధారణంగా ఏపీలో కులాల ఆధారంగానే రాజకీయాలు జరుగుతాయి. కుల సమీకరణాలని బేరీజు వేసుకుని నాయకులు రాజకీయాలు చేస్తారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక మత రాజకీయం కూడా నడుస్తోంది. ఇక ఈ మత రాజకీయం ఎవరు సృష్టించారో తెలియదు గానీ, గత రెండేళ్ల నుంచి రాజకీయాల్లో మతం కూడా వచ్చేసింది. జగన్ అధికారంలోకి వచ్చాక హిందూ దేవాలయాలపై, హిందూ దేవుళ్ళపై ఏ స్థాయిలో దాడులు జరిగాయో అందరికీ తెలిసిందే.

దీనిపై ప్రతిపక్షాలు కూడా జగన్ ప్రభుత్వంపై తీవ్రంగా ఫైర్ అవుతూ వచ్చాయి. జగన్ ఒక క్రిస్టియన్ అని, ఆయన హిందూ మత వ్యతిరేకి అని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తూ వచ్చాయి. వైసీపీ నేతలు, కార్యకర్తలే దేవాలయాలపై దాడులు చేశారని ఆరోపించారు. అయితే ఇదంతా ప్రతిపక్షాలు కుట్ర అని, ప్రతిపక్ష పార్టీలే ఇవన్నీ చేసి ఆ ఆరోపణలని జగన్‌పై తోసేయాలని చూస్తున్నారని వైసీపీ నాయకులు కూడా కౌంటర్లు ఇచ్చారు.

కానీ ఏది ఎలా జరిగినా జగన్ ప్రభుత్వం కాస్త హిందూ మతానికి వ్యతిరేకంగా ఉందనే ముద్రపడిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా జగన్ తీసుకున్న మరో నిర్ణయం కూడా హిందూ వర్గాలని విస్మయానికి గురి చేసినట్లు కనిపిస్తోంది. కోవిడ్ నేపథ్యంలో వినాయకచవితి పండుగని ఇంట్లోనే జరుపుకోవాలని చెప్పి, వినాయక చవితి ఊరేగింపులు, నిమజ్జనాలపై నిషేధం విధించింది.

దీంతో హిందూ వర్గాలు, ప్రతిపక్ష పార్టీలు జగన్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నాయి. ఒకవైపు స్కూళ్లు, సినిమా హాళ్లు, వాణిజ్య సంస్థలు తెరిచారని, ఇంకా మద్యం షాపుల వద్ద గుంపులు గురించి చెప్పాల్సిన పని లేదని, వాటికి లేని ఆంక్షలు పండుగకు ఎందుకు పెడుతున్నారని విమర్శిస్తున్నారు. అయితే జగన్ ప్రభుత్వం కావాలనే హిందూ పండుగలపై ఆంక్షలు విధిస్తుందని, జగన్ హిందూ వ్యతిరేకి అని అర్ధమైపోతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Discussion about this post