రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇటీవల కాలంలో చోటు చేసుకున్న వివాదాలు అందరికీ తెలిసిందే. తెలంగాణ సీఎం.. కేసీఆర్.. దూకుడుగా వ్యవహరించడం.. రాత్రికిరాత్రి ఆదేశాలు జారీ చేసి.. పులిచింతల ప్రాజెక్టు నుంచి నీళ్లు లేకపోయినా.. జలవిద్యుత్తును నిరాఘాటంగా ఉత్పత్తి చేయడం.. ఏపీని కనీసం పట్టించుకోకపోవడం.. అక్కడ పోలీసులను మోహరించి..ఏపీ ఉన్నతాధికారుల ను కూడా అనుమతించకపోవడం.. వంటి పరిణామాలు.. ఇరు రాష్ట్రాల మధ్య `ఇక పోరే` అన్న వ్యాఖ్యలు వినిపించేలా చేశాయి. ఇక, ఏపీ సీఎం జగన్..కూడా ఈ విషయంలో చాలా మౌనంగా ఉంటూ.. కేంద్రానికి, ముఖ్యంగా ప్రధాని మోడీకి లేఖ సంధించారు.
ఇదే విషయంలో ఆయనకు అనుకూలంగా కేంద్రం.. కృష్ణా రివర్ బోర్డును, గోదావరి రివర్ బోర్డులను ఏర్పాటు చేస్తూ.. వీటిని తమ అదుపులోకి తీసుకుంది. ఇక, దీంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత కష్టమేనని.. జల వివాదాలు ఇప్పట్లో సమసిపోవని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఆదిలో అంటే. 2019కి ముందు ఉన్న స్నేహం కొడిగట్టినట్టేనని.. ఒకరి ముఖం ఒకరు చూసుకోరని కూడా విశ్లేషణలు వచ్చాయి. ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డిని…నరరూప రాక్షసుడని.. దుర్మార్గుడని.. తెలంగాణ పాలిట శత్రువని.. ఇలా తెలంగాణ మంత్రులు దుమ్మెత్తి పోశారు.
ఈ పరిణామాలతో ఇక, ఏపీ తెలంగాణల మధ్య సఖ్యత ఛస్తే.. కుదరదని అందరూ అనుకున్నారు. అయితే.. ఇప్పుడు తాజాగా చోటు చేసుకున్న పరిణామం తర్వాత.. ఇవన్నీ.. తూచ్! అనే వ్యాఖ్యలు వ్యక్తమవుతున్నాయి. జలజగడం కేవలం రాజకీయంలో భాగమేనని అంటున్నారు పరిశీలకులు. తాజాగా ఏం జరిగిందంటే.. తెలంగాణకు జగన్ సర్కార్ సాయం అందించింది. ‘నాడు నేడు’ సాఫ్ట్ వేర్‌ను తెలంగాణ వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. మన బడి, నాడు నేడు సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణలోని పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన కోసం వినియోగించేకునేందుకు అవకాశం కల్పించింది.ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణకు ఇచ్చేందుకు నిరభ్యంతర పత్రం జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు నడుస్తున్నా.. మరోవైపు సాఫ్ట్‌వేర్ షేర్ చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ అంగీకరించడం చూస్తే.. సదరు జలవివాదం.. తూచ్ అని అంటున్నారు మేధావులు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల ఏర్పాటుకు నిర్ణయించామని తెలంగాణ సర్కార్ తెలిపింది.
ఇందుకు సంబంధించి నాడు–నేడు సాఫ్ట్‌వేర్‌ను ప్రయోజనకరంగా ఉందని.. తాము కూడా ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకుంటామని.. దీనిపై నిరభ్యంతర ఉత్తర్వులివ్వాలి అని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఏపీ విద్యాశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పరిణామాలను గమనిస్తున్న వారు.. జల జగడంపై కేసీఆర్-జగన్‌లది జగన్నాటకమని దుయ్యబడుతున్నారు.
Discussion about this post