టీడీపీ యువ నాయకుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారా? త్వరలోనే ఆయన ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పార్టీ సీనియర్లు. పార్టీ ఇప్పుడున్న పరిస్థితి మార్చడం తక్షణ అవసరంగా పార్టీ నేతలు.. భావిస్తున్నారు. అయితే.. ఇప్పుడు.. అందరూ కురువృద్ధులే సీనియర్లు గా చలామణి అవుతుండడంతో సాహసించి..నియోజకవర్గాల్లో పర్యటించే ప్రయత్నం చేయడం లేదు. కేవలం మీడియా ముందు.. ఐదు నిమిషాలో.. అరగంటో మాట్లాడి.. జగన్‌పై నాలుగు విమర్శలు చేసి చేతులు దులుపుకొంటున్నారు.

దీంతో పార్టీ పునాదులు బలహీనమైన పరిస్థితిలో వీరు చేస్తున్న కామెంట్లకు పెద్దగా చర్చ రావడం లేదు. అనుకూల మీడియాలో కూడా ప్రాధాన్యం తగ్గిపోయిన నాయకులు చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు యువ నాయకులను ప్రోత్స హించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. పార్టీ పరంగా ప్రజల్లోకి కూడా వెళ్లాలి. అయితే.. ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్లాల నేది.. ఇప్పుడు టీడీపీ ముందున్న ప్రధాన సమస్య. ఈ క్రమంలోనే నారా లోకేష్ వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. దీనిపై విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ వర్షాకాలం ముగియగానే.. లోకేష్ నియోజకవర్గం యాత్రలు నిర్వహిస్తారని తెలుస్తోంది.

రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో తమకు పట్టున్న బలమైన నియోజకవర్గాలను పక్కన పెట్టి.. ఇప్పటికి గెలుపు గుర్రం ఎక్కనినియోజకవర్గాలు.. పార్టీకి అంత బలం లేని నియోజకవర్గాలు.. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన నియాజకవర్గాలు.. ఒకింత జాగ్రత్తలు తీసుకుంటే.. తిరుగులేని విజయం అందిస్తాయనే నియోజకవర్గాలను ఇలా.. వివిధ రీతిల్లో షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నారు. దీనిలో ప్రాధాన్యం మేరకు నెలకు 50 నియోజకవర్గాలను కవర్ చేసేలా చినబాబు ప్లాన్ చేసుకున్నారని.. ముఖ్యంగా యువతను టార్గెట్ చేసుకుని ఆయన దూసుకు పోవాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు.

ఈ క్రమంలో గత ప్రభుత్వ పథకాలు.. ప్రస్తుతం జగన్ చేస్తున్న పాలనను పోల్చుతూ.. లఘుచిత్రాలను కూడా నియోజకవర్గాల్లో ప్రదర్శించాలని నిర్ణయించారట. దీనికి సంబంధించి ఇప్పటికే.. గతంలో తమకు సేవలందించి టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడి సేవలను తీసుకుంటారని.. చర్చలు నడుస్తున్నాయని అంటున్నారు. అదే సమయంలో నియోజకవర్గం యాత్రకు సంబంధించి.. పాటలు.. నినాదాలను సిద్ధం చేసే బాధ్యతను కూడా తీసుకున్నారని.. అంటున్నారు. ఇది.. వచ్చే ఎన్నికలకు ముందస్తు వ్యూహంగా సక్సెస్ అవుతుందని.. నేతలు చాలానే ఆశలు పెట్టుకున్నారు. అయితే.. కార్యక్రమాన్ని ఎప్పుడు మొదలు పెడతారనే విషయం తెలియాల్సి ఉంంది.
Discussion about this post