గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైన దగ్గర నుంచి ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. జూనియర్ పార్టీలోకి రావాలని, పార్టీ పగ్గాలు చేపట్టాలని అప్పుడే పార్టీ నిలబడుతుందంటూ కొందరు బాగానే హడావిడి చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఇప్పటిలో రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తిగా లేరనే సంగతి తెలిసిందే. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం, ఎన్టీఆర్‌ని రాజకీయాల్లోకి ఆహ్వానించే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

అయినా పార్టీని నడిపించే సత్తా చంద్రబాబుకు ఇంకా ఉంది. అలాగే పార్టీని తిరిగి గాడిలో పెట్టడం బాబుకు అసాధ్యమైన పని కాదు. అయినా సరే పార్టీలోకి ఎన్టీఆర్ పేరుని ఎవరు తీసుకొస్తున్నారు. చంద్రబాబు పర్యటనల్లో జై ఎన్టీఆర్, సీఎం ఎన్టీఆర్ అంటూ గోల చేసేది ఎవరు? అని ప్రశ్నలు పార్టీలో ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఇదంతా కుట్రపూరితంగా జరుగుతుందని, ఎన్టీఆర్ పేరుని తెరపైకి తీసుకురావడం వెనుక వైసీపీ ఉందని కొందరు తెలుగు తమ్ముళ్ళు అనుమానిస్తున్నారు.ఏదో నలుగురైదుగురు మాత్రమే ఎన్టీఆర్ పేరుతో హడావిడి చేస్తున్నారని, వారు వైసీపీకి చెందినవారని అంటున్నారు. అలా ఎన్టీఆర్ పేరు తీసుకొచ్చి, ప్రజల్లో చంద్రబాబు సత్తా అయిపోయిందనే విధంగా క్రియేట్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోందని చెబుతున్నారు. పైగా కొడాలి నాని, వల్లభనేని వంశీలతో పాటు పలువురు వైసీపీ నేతలు ఎన్టీఆర్ పేరుని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారని గుర్తుచేస్తున్నారు.

అయితే ఇదంతా వైసీపీ కుట్రలో భాగంగానే జరుగుతుందని, కాబట్టి టీడీపీ కార్యకర్తలు దీన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని, ఇలాంటి కుట్రలని తిప్పికొట్టాలని చెప్పి పలువురు తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు. అంటే ఎన్టీఆర్ పేరుతో పార్టీలో అలజడి సృష్టించి, పరోక్షంగా లబ్ది పొందాలని వైసీపీ ప్లాన్ చేసిందని అంటున్నారు. కాబట్టి టీడీపీలో ఎన్టీఆర్ పేరుతో రచ్చ చేసేది వైసీపీ కార్యకర్తలే అని చెబుతున్నారు.
Discussion about this post