ఆయన ఆ జిల్లా టీడీపీ రాజకీయాల్లో సీనియర్ నేత ఏమీ కాడు. కానీ చంద్రబాబుకు నమ్మిన బంటు. బాబు మాట ఆయనకు వేదం. అందుకే ఆయనకు ఏకంగా హోం శాఖ వంటి కీలకమైన బాధ్యతలు అప్పగించి ఉప ముఖ్యమంత్రిని కూడా చేశారు చంద్రబాబు. నిజానికి గోదావరి జిల్లాల్లో యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి సీనియర్ నాయకులు. కానీ చంద్రబాబు బీసీలు, కాపులు అంటూ బ్యాలన్స్ చేస్తూ 2014 ఎన్నికలలో మంత్రి పదవులు కట్టబెట్టారు. ఆ తరువాత ఎస్సీలకు చోటు అంటూ ముందు పీతల సుజాతకు అవకాశం ఇచ్చి తరువాత జవహర్ ని మంత్రిని చేశారు. మొత్తానికి చిన రాజప్ప అందరిలోనూ పెద్ద పోస్టు కొట్టేసి పెద్దాపురం ఎమ్మెల్యే ది బెస్ట్ అనిపించుకున్నారు.

ఇపుడు చూస్తే తూర్పు గోదావరి జిల్లాలోనే కాదు, విశాఖలోనూ ఆయనే పార్టీ రిపేర్లు చూడాలి. ఆయనే ఏ వ్యవహారం అయినా చక్కబెట్టాలి. ఆయన మాట మృదువుగా ఉంటుంది. ఎవరినీ నొప్పించరు, శాంతం, సహనం ఎక్కువ. అంతే కాదు పూసగుచ్చినట్లుగా ఏం జరిగినా చంద్రబాబుకు వివరిస్తారు. ఇందులో తన సొంత బుర్ర పెట్టరు, సొంత రాజకీయం అసలు చూసుకోరు. అందుక ఆపరేషన్ గోరంట్ల కూడా బాబు ఆయనకే అప్పగించారు. ఇక చినరాజప్ప జగన్ సునామీలో కూడా గెలిచి సత్తా చాటారు. అది కూడా ఆయన పట్ల బాబుకు గురి కుదరడానికి కారణంగా ఉంది.

మరో వైపు బుచ్చయ్య చౌదరి సీనియర్ ని అనే ఇగోతో ఉంటారన్న టాక్ ఆ పార్టీ వర్గాల్లోనే ఉంది. యనమల రామకృష్ణుడు పలు మార్లు ఓడి జనంలో బలం లేదని నిరూపించుకున్నారు. దీంతో అతి పెద్ద జిల్లా అయినా తూర్పులో చిన రాజప్పే పెద్ద రాజప్పగా మారిపోయాడు అంటున్నారు. అంతే కాదు పక్కనే ఉన్న కీలకమైన విశాఖలోనూ ఆయనే పార్టీ బాధ్యుడిగా చక్రం తిప్పుతున్నారు. ఇక్కడ ఒక ముచ్చట చెప్పుకోవాలి. 2018లో ఒకసారి అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు అలిగి విశాఖలో చంద్రబాబు పర్యటనకు రాను అంటే చినరాజప్పే రాయబారం చేసి ఆయన్ని బాబు వద్దకు తీసుకొచ్చారు.

ఇపుడు కూడా ఆయన తూర్పుతో గోరంట్ల సహా ఏ నేత కూడా పార్టీ నుంచి జారకుండా చూడగలరని అధినాయకత్వం నమ్ముతోంది. మొత్తానికి దూకుడుగా రాజకీయం చేయకపోయినా కూడా చినరాజప్ప తనదైన నెమ్మదితనంతోనే నెట్టుకురావడం నిజంగా గ్రేటే అంటున్నారు. ఆయనను పార్టీకి ట్రబుల్ షూటర్ గా కూడా చెబుతున్నారు.

Discussion about this post