విజయనగరం జిల్లాల్లో బొబ్బిలి రాజులు అతి ముఖ్యమైన వారు. విజయనగరంలో పూసపాటి రాజుల మాదిరిగానే వారికి కూడా వందల ఏళ్ళ చరిత్ర ఉంది. మొదటి నుంచి పూసపాటి రాజులు టీడీపీలోనూ అంతకు ముందు ప్రతిపక్షంలోనూ ఉండేవారు. బొబ్బిలి రాజులు అయితే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో బొబ్బిలి రాజులు ముఖ్యమంత్రి పదవిని కూడా నిర్వహించారు. వారి రాజకీయం అంతా కూడా 1968 దాకా కొనసాగింది. తిరిగి వారి వారసుడిగా సుజయ క్రిష్ణ రంగారావు 2004లో పాలిటిక్స్ లోకి ప్రవేశించారు.
ఆయన కాంగ్రెస్ నుంచి నాడు ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత 2009లో కూడా కాంగ్రెస్ నుంచి గెలిచినా తరువాత వైసీపీలో చేరిపోయారు. ఆయన సోదరుడు బేబీనాయనతో కలసి విజయనగరం జిల్లా వైసీపీ రాజకీయాలో చక్రం తిప్పేవారు. అయితే బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరడంతో ఆగ్రహించిన సుజయ క్రిష్ణ రంగారావు టీడీపీలోకి చేరారు. ఆయన టీడీపీ సర్కార్ లో గనుల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తరువాత చూస్తే 2019 ఎన్నికల్లో ఓడిపోయారు.ఇవన్నీ ఇలా ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక పూసపాటి రాజులతో గొడవలు ఎక్కువగా వస్తున్నాయి. మాన్సాస్ ట్రస్ట్ ని మొదట కదిపి సంచయితను అక్కడ కూర్చోబెట్టడం ద్వారా సమరానికి వైసీపీ తెర తీసింది. దాని మీద హై కోర్టు అశోక్ గజపతిరాజుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దాంతో పూసపాటి రాజుల మీద ప్రత్యక్ష యుధ్ధానికి వైసీపీ నేతలు దిగిపోయారు. ఈ క్రమంలో వారికి దన్నుగా మరో బలమైన సామాజిక వర్గం కావాల్సి వస్తోంది. దాంతో వైసీపీ నేతలకు బొబ్బిలి రాజుల మీద కన్ను పడింది అంటున్నారు.
బొబ్బిలి యుద్ధంలో హీరోలు బొబ్బిలి రాజులు అయితే విలన్లు విజయనగరం రాజులు అంటూ ఈ మధ్య విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ అందులో భాగమే అంటున్నారు. పౌరుషానికి ప్రతీకలు బొబ్బిలి రాజులు అంటూ ఆయన కీర్తించడం వెనక వారిని మచ్చిక చేసుకుందామన్న ఆలోచన ఉందని అంటున్నారు. మరి విజయనగరం జిల్లా వైసీపీ రాజకీయాల్లో మార్పు వస్తే తప్ప బొబ్బిలి రాజులు ఈ వైపు చూడరని అంటున్నారు. ఏది ఏమైనా విజయనగరం జిల్లా ఇపుడు పాలిటిక్స్ కి హాట్ ప్లేస్ గా మారుతోంది.
Discussion about this post