తిరుపతి పార్లమెంట్…తెలుగుదేశం పార్టీకి అసలు కలిసిరాని స్థానం. టిడిపి దరిద్రం ఏంటో గానీ….ఇది చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఉన్నా సరే ఇంతవరకు తిరుపతిలో టిడిపికి కలిసిరాలేదు. ఏదో 1984లో మాత్రమే టిడిపి ఒక్కసారి ఇక్కడ గెలిచింది. అంతే ఇంకా ఆ తర్వాత ఎప్పుడు తిరుపతిలో టిడిపి జెండా ఎగరలేదు. అయితే 1999 ఎన్నికల్లో టిడిపితో పొత్తులో భాగంగా బిజేపి ఒకసారి ఇక్కడ గెలిచింది.

ఆ తర్వాత నుంచి టిడిపికి ఏ మాత్రం సెట్ అవ్వలేదు. ఇక గత రెండు ఎన్నికల నుంచి తిరుపతిలో వైసీపీ విజయం సాధిస్తూ వస్తుంది. ఇటీవల జరిగిన తిరుపతి ఉపఎన్నికలో కూడా వైసీపీనే విజయం సాధించింది. అయితే భవిష్యత్‌లో కూడా తిరుపతి పార్లమెంట్ స్థానంలో టిడిపి జెండా ఎగిరేలా కనిపించడం లేదు. ఒకవేళ రాష్ట్రంలో టిడిపి గాలి ఉన్నా సరే తిరుపతిలో మాత్రం వైసీపీ ఆధిక్యమే కొనసాగేలా కనిపిస్తోంది. అంటే తిరుపతి పరిధిలో ఓటర్లు ఏ స్థాయిలో వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారో అర్ధమవుతుంది.

అయితే మొదట నుంచి తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో కూడా టిడిపికి మంచి విజయాలు దక్కలేదు. టిడిపి గాలి ఉన్న 2014 ఎన్నికల్లో సైతం ఇక్కడ వైసీపీ హవానే నడిచింది. 2019 ఎన్నికల్లో అయితే చెప్పాల్సిన పని లేదు. తిరుపతి పార్లమెంట్ స్థానంతో పాటు, పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది.

తిరుపతి పరిధిలో ఉన్న గూడూరు, సర్వేపల్లి, వెంకటగిరి, సూళ్ళూరిపేట, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగిరిగింది. ఇటీవల తిరుపతి ఉపఎన్నికలో కూడా ఈ ఏడు నియోజకవర్గాల్లో వైసీపీకే మెజారిటీ వచ్చింది. అంటే ఏ విధంగా తిరుపతిలో టిడిపి పరిస్తితి ఉందో అర్ధమవుతుంది. మొత్తానికి తిరుపతిలో టిడిపి సెట్ అయ్యేలా కనిపించడం లేదు.

Discussion about this post