తెలంగాణలో గత కొద్ది రోజులుగా అధికార టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ తొలి ప్రభుత్వంలో కీలక నేతలుగా ఉన్న వారికి ఇప్పుడు రెండోసారి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రయార్టీ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు రాజకీయంగా తెలంగాణలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వారికి ప్రాధాన్యత పెంచాల్సిన అవసరం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. జిల్లాలకు జిల్లాలను, లేదా సామాజిక వర్గాలను ప్రభావితం చేసే నాయకులను ఇప్పుడు కేసీఆర్ నెత్తిన పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈ లిస్టులోనే కేసీఆర్ ఎంతో అప్యాయంగా బావ అని పిలుచుకునే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఇప్పుడు రాజకీయంగా పునర్వైభవం రాబోతోందన్న చర్చలు గులాబీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
తుమ్మలకు రెండోసారి ప్రభుత్వం ఏర్పడ్డాక పార్టీలో ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది. ఇందుకు ప్రధాన కారణం పాలేరులో ఆయన గత ఎన్నికల్లో ఓడిపోవడమే..! ఎన్నికల్లో ఓడిపోయాక తుమ్మలను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నాలు అయితే జరిగాయి. తుమ్మల రాజకీయంగా యాక్టివ్ గా లేకపోతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిణామాలు శరవేగంగా మారిపోనున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు తుమ్మలకు కేసీఆర్ నుంచి ఫోన్ వచ్చినట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఆయన హైదరాబాద్‌లో ఉన్న తన క్వార్టర్‌ను ఖాళీ చేసే ప్రయత్నం చేయగా.. వద్దని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఆయనకు కీలక పదవి కట్టబెడుతున్నట్టు టాక్ ?
అయితే ఆ పదవి ఎమ్మెల్సీనా లేదా మరోదైనా పదవా ? అన్నది మాత్రం తెలియదు. కీలకమైన వ్యవసాయ శాఖ విషయంలో కేసీఆర్ తుమ్మల సలహాలు ఫాలో అవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు భోగట్టా ? తెలంగాణలో ఫామాయిల్ సాగు విస్తీర్ణం పెంచాలని కేసీఆర్ పట్టదలతో ఉన్నారు. అయితే ఇరవై ఏళ్ల క్రితమే తుమ్మల సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో మంత్రిగా ఉన్నప్పుడే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముందు చూపుతో వేసిన ఫామాయిల్ తోటలు ఈ రోజు తెలంగాణలో అక్కడ రైతులను ధనవంతులను చేశాయి. ఈ విషయంలో తుమ్మలను కేసీఆర్ ఎంతో అభినందించడంతో పాటు దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్త బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించే ప్రయత్నం అయితే జరుగుతోందట. అయితే తుమ్మలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారన్నదే ఇప్పుడు సస్పెన్స్ ? తుమ్మలకు ఇప్పుడు కేసీఆర్ పిలుపుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కారు పార్టీలో సరికొత్త చర్చలు అయితే జరుగుతున్నాయి.
Discussion about this post