ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముద్ర ఏంటనేది తెలుగు రాజకీయాలకు సుపరిచితమే. నాలుగు దశాబ్దాలకు చేరువవుతున్న ఆయన రాజకీయ ప్రస్థానంలో చాలా ఏళ్ళు జిల్లా రాజకీయాలను తన కనుసైగలతో శాసించారు. టీడీపీలో ఉన్నంతకాలం ఆయన తిరుగులేని నేతగా ఉన్నారు. అదే సమయంలో టీఆర్ఎస్ లోకి వచ్చి ఇక్కడ కూడా మంత్రి అయ్యి చక్రం తిప్పారు. 2018 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తుమ్మల రాజకీయ జీవితం తలకిందులైంది. ఒక సీనియర్ నేత గా ఉండి కూడా ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. టిఆర్ఎస్ లో చేరిన వెంటనే కేసీఆర్ తుమ్మల ను ఎమ్మెల్సీ చేయడంతోపాటు ప్రతిష్టాత్మకమైన రోడ్లు భవనాల శాఖ కట్టబెట్టారు.
తర్వాత పాలేరు ఉప ఎన్నికల్లో కేసీఆర్ సూచనమేరకు పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2018 సాధారణ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా మొత్తం మీద ఖమ్మం సీటు మినహా అన్ని చోట్ల టీఆర్ఎస్ ఓడిపోయిం. ఇక్కడ ఒకే ఒక ఎమ్మెల్యేగా గెలిచిన పువ్వాడ అజయ్ కు మంత్రి పదవి దక్కింది. ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో అజయ్ తో పాటు ఎంపీ నామా నాగేశ్వరరావు హవా కొనసాగుతుండగా తుమ్మల, పొంగులేటి వర్గాలు వెనకబడి పోయాయి. జిల్లాలో తుమ్మల కు ఎంత పట్టు ఉన్నా అధికారం లేకపోతే చెయ్యటానికి ఏం ఉండదు కదా..! ఇక గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి తుమ్మలకు ఎమ్మెల్సీ వస్తుందన్న ప్రచారం జరుగుతుంది తప్ప ఆయన పట్టించుకునేవారు లేరు.
ఇక ఇప్పుడు తుమ్మలకు బీజేపీతో పాటు షర్మిల పార్టీ నుంచి కూడా ఆహ్వానాలు ఉన్నాయంటున్నారు. తుమ్మల లాంటి బలమైన నేత పార్టీ వీడితే అది ఖమ్మం జిల్లాలో పార్టీకి ఎదురు దెబ్బే అవుతుంది. టీడీపీ కేడర్ మొత్తం ఆయన వెంటే నడిచింది. త్వరలో జరిగే ఎమ్మెల్సీ పదవుల భర్తీలో తుమ్మలకు కేసీఆర్ ఒక ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఒక వేళ అజయ్ – కేటీఆర్ లాబీయింగ్‌లో తుమ్మలకు పదవి రాకపోతే తుమ్మల కారు దిగే యోచన చేస్తారా ? లేదా రాజకీయాలకు పూర్తిగా దూరమవుతారా ? అన్నది చూడాలి.
Discussion about this post