నిజాలూ నిష్టూరాలు, నిందలు ఇవన్నీ రాజకీయాల్లో సర్వ సామాన్యం. వాటిని తట్టుకుని నిలబడగలిగిన వారే బహు మొనగాడు అవుతారు. ఇక జగన్ రాజకీయ జీవితంలో నిందలూ నిష్టూరాలు ఎన్నో ఉన్నాయి. అయితే చిత్రమేంటి అంటే ఇప్పటికీ వాటిలో అసలు నిజాలు ఏంటో ఎవరికీ తెలియకపోవడం. వాటిని విప్పి చెప్పాల్సిన జగన్ కూడా పట్టించుకోకపోవడం. దాంతో లక్ష కోట్లు తిన్న జగన్ అంటే నమ్మేవారు ఇప్పటికీ ఉన్నారు. అలా కాదు ఇది నిజమని వైసీపీ నుంచి కానీ జగన్ వైపు నుంచి కానీ ఈ రోజుకూ గట్టి ఖండనలు రాకపోవడం కూడా ఒక రకమైన వ్యూహంలో భాగమేమో.
ఇదిలా ఉంచితే ఇపుడు జగన్ కేసీయార్ దోస్తీ మీద కూడా రకరకాలైన ప్రచారం సాగుతోంది. చిత్రమేంటి అంటే అవతల తెలంగాణాలోనూ, ఇటు ఏపీలో కూడా విపక్షాలు ఈ ఇద్దరూ కుమ్మక్కు అయ్యారనే అంటున్నాయి. అంతదాకా ఎందుకు కొత్తగా తెలంగాణాలో పార్టీ పెట్టిన షర్మిల కూడా తన అన్న కేసీయార్ మంచి మిత్రులు అంటూ గుట్టు చెప్పేశారు. మరి అలా విషయం జన ప్రచారంలో ఉంటే రాయలసీమకు నీళ్లు జగన్ ఎందుకు తేలేకపోతున్నారు అన్న ప్రశ్న కూడా వస్తుంది. అంటే ఈ స్నేహం అంతా వన్ సైడెడ్ గా కేవలం కేసీయార్ రాజకీయ ప్రయోజనాల కోసమేనా అన్నట్లుగా కూడా విమర్శలు ఉన్నాయి.ఇపుడు వీటితో పాటే మరో ప్రచారం కూడా సాగుతోంది. షర్మిల కొత్త పార్టీ వెనక జగన్, కేసీయార్ ఉన్నారని, వీరిద్దరే కలసి ఆమె చేత పార్టీ పెట్టించి తెలంగాణా అంతటా తిప్పిస్తున్నారని, దీని వల్ల లాభమేంటి అంటే అది కూడా జగన్ కి షర్మిలకు లాభం కానే కాదు, అంతిమంగా కేసీయార్ కేనట. అదెలా అంటే కేసీయార్ వచ్చే ఎన్నికల్లో గట్టి ఫైట్ ఎదుర్కోబోతున్నారు. మరి ఆయన పార్టీకి రావాల్సిన ఓట్లు ఎటూ వస్తాయి. కానీ యాంటీ ఇంకెంబెన్సీ పెరిగితే అవతల పక్షం గెలిచే అవకాశాలు ఉన్నాయి. దాంతో తన వ్యతిరేక ఓటుని చీల్చేందుకే షర్మిల చేత పార్టీ పెట్టించారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అంటున్నారు.
అదే కనుక జరిగితే కేసీయార్ గెలవవనూ వచ్చు, ఓడనూ వచ్చు. కానీ తెలంగాణాలో ఈ ప్రచారం పాకితే అక్కడ షర్మిల పార్టీ వైపు చూసే వారు ఎవరూ ఉండరు, ఇక్కడ జగన్ కి కూడా రాజకీయంగా ఇబ్బందే అవుతుంది. ఇప్పటికే ఆవిర్భావ సభలో డోస్ పెంచి అన్నను విమర్శించిన షర్మిల అక్కడ రాజకీయాలో ఇంకా దూకుడు పెంచితే నష్టపోయేది జగనే. మరి ఈ ప్రచారం కూడా నిందా నిజమా, నిష్టూరమా అంటే మాత్రం జగన్ వద్ద కానీ వైసీపీ వద్ద కానీ జవాబు ఉండదేమో.
Discussion about this post