నేను కొట్టినట్లుగా చేతులెత్తుతాను, నీవు ఏడ్చినట్లుగా బావురుమని గొంతు పెంచు అని తమాషా చేసే ఆసాములు వెనకటికి చాలా మంది ఉన్నారు. ఇపుడు ఏపీ తెలంగాణాల మధ్య జల జగడం పేరిట ఇలాంటి రాజకీయమే సాగుతోందా అన్న అనుమానాలు అందరిలో పెరిగిపోతున్నాయి. లేకపోతే ఇన్నాళ్ళూ లేనిది ఇపుడు హఠాత్తుగా అక్కడ కేసీయార్ గర్జించడం, ఇక్కడ అందిపుచ్చుకుని జగన్ భారీ రియాక్షన్ ఇవ్వడం ఇదంతా చూస్తూంటే చోద్యంగానే ఉందని అంటున్నారు. క్రిష్ణ జలాల విషయంలో ఎన్నడూ లేని విధంగా ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం వెనక సిసలైన పాలిట్రిక్స్ ఉందని కూడా అంటున్నారు. కేసీయార్ అక్కడ పొలిటికల్ గా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆయన తెలంగాణా వాదం వీగిపోతోంది. ప్రత్యర్ధి పార్టీలు బాగా సర్దుకుంటున్నాయి.
ఓ వైపు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ని నియమించి జోరు పెంచేసింది. బీజేపీలోకి మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెళ్ళాక కమలం పార్టీ కదం తొక్కుతోంది. ఈ నేపధ్యంలో ఏడేళ్ళ కేసీయార్ పాలన మీద సహజంగానే జనాలలో వ్యతిరేకత పెరుగుతోంది. వీటిని తప్పించుకోవడానికి, ఈటల ఎపిసోడ్ ని జనాల్లో చర్చకు పెట్టకుండా చేయడానికి కేసీయార్ వేసిన ఎత్తుగడ క్రిష్ణ జలాల పేరిట జగడం అంటున్నారు. దానికి ఆంధ్రా తమ్ముడు జగన్ సై అంటున్నారు అన్నదే ఏపీలోని విపక్షాల అనుమానం. నిజానికి రాయలసీమ ఎత్తిపోతల పధకం అన్నది పెద్ద సమస్య కానే కాదు. కేసీయార్ కి చెప్పి ఆయన ఓకే అన్న తరువాతనే జగన్ ఇక్కడ శ్రీకారం చుట్టారని చెబుతారు.ఈ విషయాన్ని జగన్ మంత్రివర్గ సహచరుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా చెప్పారు. మరో వైపు గత ఏడాది తిరుపతి వచ్చినపుడు కేసీయార్ ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్ళి అల్పాహారం స్వీకరించారు. ఆ సమయంలో ఆయన అన్న మాటలు పత్రికలలో రికార్డు అయ్యాయి. రాయలసీమకు నీటి కష్టాలు ఉన్నాయి. ప్రాజెక్టులు కట్టుకునేందుకు తాము సహకరిస్తామని కూడా ఆయన చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. మరి ఇంతలో అంతలా కేసీయార్ దూకుడు చేయడం అంటే ఫక్త్ రాజకీయమే తప్ప మరోటి కాదు అంటున్నారు. తెలంగాణావాదం ఎంత పదిలంగా అంటే అంతలా కేసీయార్ రాజకీయం సాగుతుంది.
అదే సమయంలో రాయలసీమలో వైసీపీ పునాదులు గట్టిగా ఉంటేనే ఏపీలో జగన్ కి అధికారం దక్కే సూచనలు ఉంటాయి. ఈ మధ్య రాయలసీమలో వైసీపీ మీద వ్యతిరేకత పెరుగుతోంది. రెండు సార్లు సీమలో బంపర్ విక్టరీ ఇస్తే ముఖ్యమంత్రి అయ్యాక జగన్ సీమకు చేసింది ఏదీ లేదు అన్న ఆవేదన జనాలలో ఉంది. సీమకు న్యాయంగా దక్కాల్సిన హక్కుల విషయంలోనూ జగన్ పట్టనట్లుగా ఉంటున్నారు అన్నది జనాభిప్రాయంగా ఉంది. అన్నిటికీ మించి విశాఖను రాజధానిగా జగన్ ప్రకటించడం పట్ల సీమ జనం రగులుతున్నారు. దీంతో సీమలో రాజకీయంగా పట్టు సాధించడం జగన్ కి అత్యవసరంగా ఉంది.ఈ కారణంగానే అటు కేసీయార్, ఇటు జగన్ తమ ప్రాంతాల ప్రయోజకులుగా ఫైటింగ్ చేస్తున్నట్లుగా కలరింగ్ ఇస్తున్నారు అంటున్నారు. ఇదంతా రాజకీయం కోసమే తప్ప మరోటి కాదని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంటున్నారు. మరో వైపు చూస్తే ఈ రోజుకీ కేసీయార్, జగన్ ల మధ్య హాట్ లైన్ ఫోన్ సంబంధాలు కొనసాగుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అంటున్నారు. మొత్తానికి అటూ ఇటూ జనాల్లో ఉద్రిక్తలు రేపేలా తెర మీదకు తెచ్చిన జల జగడం ఉత్తిత్తి యుద్ధమే సుమా అని తలపండిన రాజకీయ నాయకులు తేల్చేస్తున్నారు.
Discussion about this post