తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం….ఇక్కడ పార్టీలు కంటే వ్యక్తులే చాలా బలంగా ఉంటారని చెప్పొచ్చు. ముఖ్యంగా తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్, చెల్లుబోయిన వేణుగోపాల్ లాంటి నాయకులకు రామచంద్రాపురంలో తిరుగులేదు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ముగ్గురు నాయకులు ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారు. ఇక ఇక్కడ టీడీపీకి సరైన నాయకుడే లేడు. మొన్నటివరకు తోట త్రిమూర్తులు టీడీపీ తరుపున పని చేశారు. 1994లో ఇండిపెండెంట్‌గా గెలిచిన తోట, 1999లో టీడీపీ తరుపున గెలిచారు. 2004లో ఓడిపోయిన ఆయన, 2009లో ప్రజారాజ్యంలోకి వెళ్ళి ఓడిపోయారు. 2012 ఉపఎన్నికలో కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ 2014లో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు.

అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తోట, వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన మండపేట వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీ అయ్యారు. అటు పిల్లి సుభాష్ రాజ్యసభకు వెళ్లారు. ఇటు రామచంద్రాపురం ఎమ్మెల్యే వేణుగోపాల్ జగన్ క్యాబినెట్‌లో పనిచేస్తున్నారు. అయితే తోట వెళ్లిపోయాక రామచంద్రాపురంలో టీడీపీని నడిపించే నాయకుడే లేకుండా పోయారు. కానీ తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, రెడ్డి సుబ్రహ్మణ్యంని రామచంద్రాపురం ఇన్‌చార్జ్‌గా పెట్టారు. ఈయన మొన్నటివరకు ఎమ్మెల్సీగా ఉన్నారు. అలాగే శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా పనిచేశారు.

అయితే ఇప్పుడు ఆయన్ని రామచంద్రాపురంలో ఇన్‌చార్జ్‌గా పెట్టారు. మరి ఇక్కడ బలంగా ఉన్న వైసీపీకి రెడ్డి సుబ్రహ్మణ్యం ఏ మేరకు చెక్ పెడతారనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ పార్టీల బలం కంటే వ్యక్తుల బలమే ఎక్కువ. అంటే తోట వెళ్లిపోయాక ఇక్కడ టీడీపీకి కొంత బలం తక్కువ ఉందనే చెప్పొచ్చు. అలాగే రెడ్డి సుబ్రహ్మణ్యం కూడా పెద్దగా ప్రజల్లో తిరిగే మనిషి కాదు. కానీ ఇప్పుడు రామచంద్రాపురంలో యాక్టివ్‌గా ఉంటూ, పార్టీని నిలబెట్టాలి. మరి ఈయన, తోట స్థానాన్ని ఎంతవరకు భర్తీ చేస్తారో చూడాలి.
Discussion about this post