ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ బహిష్కరించిన విషయం తెలిసిందే. కాకపోతే గతంలోనే నామినేషన్స్ ప్రక్రియ జరిగిపోవడంతో కొందరు తెలుగు తమ్ముళ్ళు పోటీకి దిగారు. కొందరేమో నామ మాత్రంగా పోటీ చేశారు. టిడిపికి కంచుకోటగా ఉన్న కృష్ణా జిల్లాలో ఇదే పరిస్తితి నడిచింది. కాకపోతే కాస్త పోరాడితే తమ్ముళ్ళు మంచి విజయాలే సాధించేవారు. కానీ కొందరు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఎందుకు లేనిపోని తలనొప్పి అనుకుని పార్టీని గాలికొదిలేశారు.

కృష్ణా తమ్ముళ్ళలో పోరాట స్పూర్తి కొరవడింది. పైనున్న నాయకులు సపోర్ట్ లేకపోయినా తాము మాత్రం పోరాడాలని తమ్ముళ్ళు అనుకోలేదు. కానీ కృష్ణా జిల్లాల్లో ఒక్క అవనిగడ్డ నియోజకవర్గంలో తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో తమ్ముళ్ళు ముందే కాడి పారేశారు. దివిసీమ తమ్ముళ్ళు మాత్రం అలా చేయలేదు. తమ శక్తివంచన మేర పోరాడారు. ఇక్కడ టిడిపి నేత మండలి బుద్ధప్రసాద్ సపోర్ట్ పెద్దగా లేకపోయినా కొన్ని మండలాల్లో తమ్ముళ్ళు అదిరిపోయే పోరాటం కనబర్చారు. మొత్తం అవనిగడ్డ పరిధిలో 74 ఎంపిటిసిలు ఉంటే వైసీపీ 51 ఎంపిటిసిలని గెలుచుకుంది. అటు టిడిపి 19 చోట్ల గెలవగా, జనసేన 4 చోట్ల గెలిచింది.

అయితే కృష్ణా జిల్లాలో టిడిపి ఎక్కువ ఎంపిటిసిలు గెలిచిన నియోజకవర్గం అవనిగడ్డ. ఇక్కడ తమ్ముళ్ళు గట్టిగానే పోరాడారు. ముఖ్యంగా చల్లపల్లి, మోపిదేవి మండలాల్లోని టిడిపి కార్యకర్తలు, వైసీపీకి చుక్కలు చూపించారు. ఈ క్రమంలోనే మోపిదేవి జెడ్‌పిటిసి స్థానాన్ని టిడిపి ఖాతాలో వేసుకుంది. అసలు కృష్ణా జిల్లాలో టిడిపి గెలిచిన ఏకైక జెడ్‌పిటిసి స్థానం ఇదే.

అటు చల్లపల్లి మండలంలో 15 ఎంపిటిసి స్థానాలు ఉంటే టిడిపి 8 గెలుచుకోగా, వైసీపీ 7 చోట్ల గెలిచింది. అంటే చల్లపల్లి ఎంపీపీ స్థానం టిడిపి ఖాతాలో పడనుంది. ఇలా దివిసీమ తమ్ముళ్ళు పోరాట పటిమని కనబర్చి సత్తా చాటారు. కానీ ఇదే పోరాటం జిల్లాలోని మిగతా టిడిపి నేతలకు లేకుండా పోయింది.

Discussion about this post