అదేంటి జగన్ మానస పుత్రిక లాంటిది కదా దిశ చట్టం అని ఎవరికైనా డౌట్ రావచ్చు. కానీ ఆచరణలో చూస్తే అదే నిజమన్న భావన కలుగుతోంది. దాదాపుగా ఏడాదిన్నర క్రితం ఏపీ సర్కార్ దిశ చట్టాన్ని చేసింది. నాడు తెలంగాణాలో ఒక యువతి మీద జరిగిన అమానుషానికి చలించి ఏపీలో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడకుండా కఠినమైన చట్టం మహిళలకు ఉండాలని జగన్ అభిప్రాయపడ్డారు. దానికి యావత్తు దేశం మొత్తం మీద మద్దతు లభించింది. జగన్ దూర దృష్టిని కూడా అంతా మెచ్చుకున్నారు. అయితే జగన్ ప్రభుత్వం దిశ చట్టం రూపకల్పన చేసే అతి ఉత్సాహంలో కొన్ని పాయింట్లు మిస్ అయింది అంటున్నారు.
ఈ చట్టం కేంద్రం వద్దకు పంపించి కూడా చాలా కాలం అయింది. అయితే కేంద్రం వద్దనే పెండింగులో ఉందని చాలా మంది అనుకుంటారు. కానీ అసలు వాస్తవం ఏమిటన్నది ఈ మధ్య జరిగిన పార్లమెంట్ సమావేశాలలో బయటపడింది. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ దీని మీద పార్లమెంట్ లో ప్రశ్నిస్తే దిశ చట్టం మీద సవరణలు చేయమని కేంద్రం కోరితే దాని మీఅ ఎలాంటి జవాబూ ఏపీ సర్కార్ నుంచి లేదుట. అలాగే కేంద్రం తెలిపిన అభ్యంతరాలకు కూడా వివరణ అన్నది అసలు లేదుట. దాంతో జగన్ సర్కార్ వద్దనే ఈ విషయం పెండింగులో ఉందని తెలిసి వైసీపీ ఎంపీ నాలుక కరచుకోవాల్సి వచ్చిందట.
మరి ఎందుకు కేంద్రం చెప్పిన అభ్యంతరాల మీద ఏపీ సర్కార్ వివరణ ఇవ్వడం లేదు అన్నదే ఇక్కడ ప్రశ్నగా ఉంది. నిజానికి ఈ చట్టం విషయంలో ఎక్కువగా శ్రధ్ధ ఉండాల్సింది జగన్ కే. తాను ప్రాణం పోసిన ఈ చట్టం అమలు అయి ఉత్తమమైన ఫలితాలు వస్తే వాటి వల్ల పేరు ప్రఖ్యాతులు కూడా పెరుగుతాయి. మహిళా లోకంలో కూడా విలువ పెరుగుతుంది. రాజకీయంగా కూడా మరింత పట్టు పెరుగుతుంది. కానీ ఎందుకో జగన్ సర్కార్ మాత్రం కేంద్రం వద్దనే ఈ బిల్లు పెండింగులో పడినట్లుగా చెబుతోంది.
మరి ఈ మధ్యనే దిశ యాప్ ని ప్రారంభించినపుడు సీఎం జగన్ మాట్లాడుతూ కేంద్రం ఎపుడు ఆమోదిస్తే నాటి నుంచి చట్టం అమలులోకి వస్తునని చెప్పుకొచ్చారు. అంటే కేంద్రమే ఈ విషయంలో ఆలస్యం చేస్తున్నట్లుగా చెప్పారు. మరి గోరంట్లకు ఇచ్చిన సమాధానం వేరుగా ఉంది. దీంతో ఎక్కడో తేడాగా ఉంది అని వైసీపీలోనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Discussion about this post