కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గం రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. మాజీ మంత్రి, ఈ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమా.. అరెస్టుతో ఇక్కడి రాజకీయ పరిణామాలు సంపూర్ణంగా మారిపోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం ఇప్పుడు ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పై కారాలు మిరియాలు నూరుతోంది. ఇతర సామాజిక వర్గాల మాదిరిగా కాకుండా.. కమ్మ సామాజిక వర్గానికి ఒక కట్టుబాటు ఉంటుంది. ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ.. తమలో తాము తేల్చుకోవాలే.. తప్ప.. రోడ్డున పడకూడదు. పరువు తీసుకోకూడదు. అనే సూత్రాన్ని అవలంబిస్తుంది. వ్యాపారాలు.. వ్యవహారాల వరకే పోటీ ఉండాలని కోరుకుంటుంది.

ఈ క్రమంలోనే గత ఎన్నికల సమయంలో మైలవరం కమ్మసామాజిక వర్గం ఆర్థికంగా కానీ.. నైతికంగా కానీ.. వైసీపీ తరఫున బరిలో నిలిచిన వసంత కృష్ణప్రసాద్‌కు మద్దతుగా నిలిచింది. నిజానికి అప్పటి వరకు కూడా దేవినేని ఉమాకు అండగా ఉంది. ఈ క్రమంలోనే ఆయన వరుస విజయాలు అందుకున్నారు. ఏ రాజకీయ నేతకైనా.. సామాజిక వర్గాల బలం ఎంతో అవసరం.. మరీ ముఖ్యంగా సొంత సామాజిక వర్గం అండ మరింత అవసరం. ఇదే వసంతకు గత ఎన్నికల్లో కలిసి వచ్చింది. దేవినేని ఉమా తమకు సహకరించడం లేదనే ఒకే ఒక్క కారణంతో ఇక్కడి కమ్మ వర్గం.. వసంతను గెలిపించిందనే టాక్ ఉంది. అయితే.. ఇప్పుడు.. పెనంపై నుంచి పొయ్యిలోకి పడిన చందంగా.. వసంత వ్యవహారం మారిపోయిందని కమ్మ వర్గమే అంటుండడం గమనార్హం.

పైగా.. దేవినేనితో ఏదైనా రాజకీయంగా ఉంటే.. మాటల ద్వారా తేల్చుకుంటే ఎవరూ ఏమీ అనేవారు కారని.. ఆయనను జైలుకు పంపే వరకు విషయాన్ని తీసుకురావడం సరికాదని.. కమ్మ వర్గం భావిస్తోంది. పోనీ.. నియోజకవర్గంలో అభివృద్ధిని కూడా వసంత పట్టించుకోవడం లేదని .. ఎప్పటి నుంచో ఇక్కడి ప్రజలు విమర్శిస్తున్నారు. తనకు పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదనే ఆలోచన తప్ప.. ఏనాడూ.. ఇక్కడి అభివృద్ధిని ఆయన పట్టించుకోలేదని విమర్శలు వున్నాయి. ఈ క్రమంలోనే దేవినేని.. తరచుగా.. అభివృద్ది విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

అదేసమయంలో నియోజకవర్గం అక్రమాలు జరుగుతున్నాయని ప్రస్తావిస్తున్నారు. దీంతో ఇటీవల కాలంలో ఆయనకు సానుభూతి పెరిగింది. దీనిని పెంచుకునే క్రమంలోనే దేవినేని దూకుడు పెంచారు. అయితే.. ఇప్పుడు ఆయనను అరెస్టు చేయించడం ద్వారా.. వసంత పెద్ద తప్పుచేశారని.. ఆయనకు సానుభూతి పెరగకపోగా.. కమ్మ వర్గంలో దేవినేని బెటర్ అనే మాట వినిపిస్తోందని అంటున్నారు. ఏదేమైనా దేవినేనిని అనవసంగా కెలికిన వసంత పరిస్థితి ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా మారింది.. ఇది వచ్చే ఎన్నికల్లో ఆయనకు తీవ్ర ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది.
Discussion about this post