మాజీ మంత్రి వైసిపి సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఇప్పటికీ తనకు మంత్రి పదవి రాలేదని తీవ్ర ఆవేదనతో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట – శ్రీకాకుళం నుంచి పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధర్మాన ప్రసాదరావు మూడు దశాబ్దాల కిందటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇక వైఎస్. రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య మంత్రి వర్గాల్లోనూ ఆయన ఉన్నారు. అలాంటి ధర్మాన ప్రసాదరావును ఇప్పుడు జగన్ పూర్తిగా పక్కన పెట్టేశారు. ధర్మాన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ ను మంత్రిని చేయడంతో పాటు ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. మంత్రి పదవి రాకపోవడంతో ధర్మాన కూడా పూర్తిగా సైలెంట్ అయిపోయారు.. అస్సలు బయటకు కూడా రావడం లేదు.

ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన లక్ష్మీపార్వతి ఓ సమావేశంలో ప్రసాద రావు త్వరలో మంత్రి అవుతావు అని చెప్పారట. లక్ష్మీపార్వతి ధర్మాన ప్రసాదరావు ను ఐస్ చేసేందుకే ఈ మాట అని ఉంటారని ఉన్నా… ఆయన మనసు లో ఉన్న బాధను గమనించే లక్ష్మీపార్వతి ఈ వ్యాఖ్యలు చేశారని అక్కడ చర్చలు నడిచాయి. గత ఎన్నికల్లో ధర్మాన చేసిన కుల రాజకీయంతో శ్రీకాకుళం ఎంపీ సీటును వైసీపీ స్వల్ప తేడాతో కోల్పోయిందని జగన్ కు నివేదికలు అందాయి. అందుకే ధర్మాన ప్రసాద రావుకు జగన్ మంత్రి పదవి ఇవ్వలేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది.

ఇప్పుడు మంత్రిగా ఉన్న ధర్మాన అన్న కృష్ణదాస్‌ను తప్పిస్తే కానీ ప్రసాద్ రావు కు మంత్రి పదవి రాదు. అయితే లక్ష్మీ పార్వతి ప్రసాద్ రావు కు మంత్రి పదవి వస్తుందని అనడంతో కృష్ణదాస్ వర్గం గుర్రుగా ఉందట. మరో వైపు ధర్మాన ప్రసాదరావు వర్గం మాత్రం మార్పుల్లో కృష్ణ దాస్ పదవి పీకేసి తమ నేతకే ఇస్తారని ప్రచారం చేసుకుంటున్నారు. ఏదేమైనా లక్ష్మీపార్వతి తన వ్యాఖ్యలతో ధర్మాన సోదరుల మధ్య చిచ్చుపెట్టిందని వైసిపి వాళ్ళు చెవులు కొరుకొంటున్నారు. ఆమె వ్యాఖ్యలు రెండు వర్గాలను హీటెక్కించాయి.
Discussion about this post