తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడుగా ఎదిగి, అదే పార్టీకి షాక్ ఇస్తూ వైసీపీ వైపు వెళ్లిన ఎమ్మెల్యేల్లో వల్లభనేని వంశీ ఒకరు. 2009లో టీడీపీ తరుపున విజయవాడ ఎంపీగా ఓడిపోయిన వంశీకి 2014లో గన్నవరం టికెట్ ఇచ్చారు చంద్రబాబు. అప్పుడు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దాసరి బాలవర్ధనరావుని సైడ్ చేసి మరీ వంశీకి సీటు ఇచ్చారు. అలా సీటు దక్కించుకున్న వంశీ 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచారు.
ఇక 2019లో టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో వంశీ వైఖరి మారింది. పైగా తన స్నేహితుడు కొడాలి నాని మంత్రిగా ఉండటంతో వంశీ పార్టీ మారడానికి చేసిన డ్రామా అంతా ఇంతా కాదన్న విమర్శలు అయితే ఆయనపై ఉన్నాయి. అంతకు ముందే వంశీపై నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని కేసు కూడా నమోదైంది. దీంతో వైసీపీ ప్రభుత్వం తనపై కక్ష సాధిస్తుందని, ఇక తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చంద్రబాబుకు వాట్సాప్ మెసేజ్‌లు కూడా చేశారు. అది నమ్మిన చంద్రబాబు సైతం వంశీకి ధైర్యం చెప్పే కార్యక్రమం చేశారు.కానీ బాబుకు షాక్ ఇస్తూ వంశీ టీడీపీని వీడి వైసీపీ వైపుకు వెళ్లారు. ఇక వైసీపీ వైపుకు వెళ్ళాక వంశీపై నమోదైన ఇళ్ల పట్టాల పంపిణీ కేసు ఏమైందో ఎవరికి తెలియదు. గత ఎన్నికల ముందు వంశీ.. బాపులపాడు తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, వేల సంఖ్యలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని ఆరోపణలు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ విషయంలో వంశీపై హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
బాపులపాడు తహశీల్దార్ ఈ ఫిర్యాదు చేశారు. అలాగే వంశీ అనుచరుడు రంగాపై కూడా కేసు నమోదైంది. ఈ కేసు నమోదు కావడంతో వంశీ డ్రామా ఆడి మరీ వైసీపీలోకి వెళ్లారని టీడీపీ వాళ్లు అంటారు. వైసీపీలోకి వెళ్ళాక ఈ ఇళ్ల పట్టాల కేసు తెరపై కనిపించడం లేదు. అంటే గంగలో మునిగితే పాపాలు పోయినట్లుగా, వైసీపీలోకి రాగానే వంశీ అక్రమాలు మాయమైపోయాయా ? అని టీడీపీ వాళ్లు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ప్రజలకు వీటికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం అయితే ఆ పార్టీపై ఉంది.
Discussion about this post