రాజకీయాల్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నాయకులు…సడన్‌గా అడ్రెస్ లేకుండా పోతారు. రాజకీయ భవిష్యత్ కోసమని పార్టీలు మారి, శాశ్వతంగా రాజకీయాల్లోనే కనిపించరు. ఇప్పుడు ఇదే పరిస్తితిలో మాజీ ఎమ్మెల్యే అనిపిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పుడు రాజకీయాల్లో ప్రవీణ్ అనే నాయకుడు గురించి ఎవరికి పెద్దగా తెలియదనే చెప్పాలి. కానీ 2009 సమయంలో ప్రవీణ్, టీడీపీలో ఓ ఫైర్ బ్రాండ్ నాయకుడు. మీడియా సమావేశాల్లో గానీ, టీవీ డిబేట్లలో గానీ టీడీపీ తరుపున బలమైన వాయిస్ వినిపిస్తూ, ప్రత్యర్ధులకు చెక్ పెట్టేవారు.

అలా టీడీపీలో ఒక వెలుగు వెలిగిన ప్రవీణ్, ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళి అడ్రెస్ లేకుండా పోయారు. అయితే ముందు నుంచి ప్రవీణ్ కుటుంబం టీడీపీలోనే పనిచేసింది. ప్రవీణ్ తల్లి లక్ష్మీదేవమ్మ టీడీపీ తరుపున రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1985, 1994 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లె నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక దేవమ్మ తర్వాత ప్రవీణ్ రాజకీయాల్లోకి వచ్చారు.యువ నాయకుడుగా టీడీపీలో దూకుడుగా పనిచేసేవారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున తంబళ్ళపల్లెలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేగా ప్రవీణ్, ప్రత్యర్ధులపై దూకుడుగా విమర్శలు చేసేవారు. టీవీ డిబేట్లలో ప్రత్యర్ధులకు గట్టిగానే కౌంటర్లు ఇచ్చేవారు. అలా తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రవీణ్…వైసీపీలోకి వెళ్ళి, తన రాజకీయ భవిష్యత్‌ని క్లోజ్ చేసుకున్నారు.

2014 ఎన్నికల ముందు ప్రవీణ్, టీడీపీ వీడి వైసీపీలోకి వెళ్లారు. తంబళ్ళపల్లె నుంచి వైసీపీ తరుపున నిలబడి ఓటమి పాలయ్యారు. ఇక ఆ తర్వాత నుంచి ప్రవీణ్ రాజకీయాల్లో కనిపించలేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ, ప్రవీణ్‌కు టికెట్ ఇవ్వలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డికి టికెట్ ఇవ్వడం, ఆయన గెలవడం జరిగిపోయాయి. మరి వైసీపీ అధికారంలోకి వచ్చినా సరే ప్రవీణ్ రాజకీయాల్లో కనిపించడం లేదు. మళ్ళీ ఆయన పోలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తారో చూడాలి.
Discussion about this post