అధికార వైసీపీకి మొదట నుంచి అనుకూలంగా ఉంటున్న జిల్లాల్లో నెల్లూరు జిల్లా ఒకటి. ఇక్కడ వైసీపీకి తిరుగులేదనే సంగతి తెలిసిందే. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీదే హవా. 2014లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినా సరే నెల్లూరులో మాత్రం సత్తా చాటలేకపోయింది. జిల్లాలో 10 సీట్లు ఉంటే టీడీపీ కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది. వైసీపీ 7 సీట్లు గెలుచుకుంది.

2019 ఎన్నికల్లో అయితే జిల్లా మొత్తం వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. జగన్ బొమ్మ చూసి నెల్లూరు జిల్లా ప్రజలు 10 మంది ఎమ్మెల్యేలని గెలిపించారు. మరి అలా జగన్ బొమ్మ చూసి ఓటు వేసిన ప్రజలకు ఈ రెండేళ్లలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు బొమ్మ చూపిస్తున్నారని తెలుస్తోంది. అసలు ప్రజలకు అందుబాటులో ఉండటంలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు పూర్తిగా వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. పైగా ఇసుక, ఇళ్ల స్థలాల్లో అక్రమాలు…ఇంకా అనేక రకాలుగా దందాలు ఎక్కువయ్యాయని తెలుస్తోంది.ఏదో ప్రభుత్వ పథకాలు మినహా ప్రజలకు కొత్తగా ఒరిగిందేమీ లేదనే చెప్పొచ్చు. అటు వైసీపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం ఏ విధంగా వేస్తుందో అందరికీ తెలిసిందే. ఈ పరిణామాలని బట్టి చూస్తే నెల్లూరు జిల్లాలో పోలిటికల్ సీన్ మారినట్లు కనిపిస్తోంది. ఇప్పుడుప్పుడే జిల్లా ప్రజలకు వైసీపీపై వ్యతిరేకిత మొదలైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గూడూరు, కావలి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో వైసీపీ గడ్డు పరిస్తితి ఎదురుకుంటున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అదే సమయంలో టీడీపీ ఇంకాస్త పుంజుకుంటే జిల్లాలో ఇంకా ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికైతే ఇప్పటికిప్పుడు వైసీపీ మూడు సీట్లు కోల్పోయే ఛాన్స్ ఉంది.
Discussion about this post