పయ్యావుల కేశవ్….దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేస్తున్న నాయకుడు. ఏ విషయాన్నైనా సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతూ, ప్రత్యర్ధులకు చెమటలు పట్టిస్తారు. వేరే నాయకులు మాదిరిగా నోరు వేసుకుని పడిపోకుండా తన సబ్జెక్ట్‌తో ప్రత్యర్ధుల నోరుమూయిస్తారు. అలా ప్రత్యర్ధుల నోరు మూయించే పయ్యావుల గత రెండేళ్ల నుంచి కాస్త సైలెంట్‌గా ఉంటున్నారు. కీలకమైన పిఏసి ఛైర్మన్ పదవి దక్కినా సరే పయ్యావుల నోరు మెదపలేదు. వైసీపీ ప్రభుత్వంలోని లెక్కల్లోని బొక్కలని పట్టుకోవడం చేయలేదు. అయితే ఇదే పయ్యావుల గతంలో ఉమ్మడి ఏపీలో పిఏసి ఛైర్మన్‌గా పనిచేసి, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెమటలు పట్టించారు. ఒకానొక సమయంలో వైఎస్సార్ సైతం పయ్యావులని మెచ్చుకుని, పార్టీలోకి ఆహ్వానించిన సందర్భాలు ఉన్నాయి.
కానీ టీడీపీ జెండా కోసం పనిచేస్తున్న పయ్యావుల, పార్టీలో నిబద్ధతతో పనిచేస్తూ ముందుకెళ్లారు. 2014లో ఓటమి పాలైన సరే చంద్రబాబు, పయ్యావులకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో పయ్యావుల గెలిస్తే, పార్టీ ఏమో ఓడిపోయి అధికారం కోల్పోయింది. ఈ క్రమంలోనే ప్రతిపక్షానికి దక్కే కీలక పదవి పిఏసి ఛైర్మన్ పయ్యావులకు దక్కింది. పదవి ఉన్నా సరే పయ్యావుల దూకుడుగా ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు. ఏదో రెండు, మూడు సందర్భాల్లో మాత్రమే పయ్యావుల అసెంబ్లీలో ప్రభుత్వానికి కౌంటర్లు ఇచ్చారు తప్ప, పిఏసి ఛైర్మన్‌గా మాత్రం దూకుడు కనబర్చలేదు.
కానీ తాజాగా మాత్రం పయ్యావుల తన మునుపటి దూకుడుని బయటపెట్టారు. వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక బిల్లుల పద్దు కింద రూ.41వేల కోట్ల మేర బిల్లులు డ్రా చేసిందని, 10,800 బిల్లుల ద్వారా ఈ మొత్తం డ్రా చేశారని చెప్పారు. ఆ డబ్బులని వైసీపీ దోచుకుందని చెప్పట్లేదని, కానీ బిల్లులు, వోచర్లు, రశీదులు లేకుండా చెల్లింపులు జరపడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. మొత్తానికి పయ్యావుల ఎంటర్ కావడంతో వైసీపీ ప్రభుత్వానికి అసలు సినిమా కనిపిస్తుందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. చూడాలి మరి రానున్న రోజుల్లో పయ్యావుల ఏ స్థాయిలో వైసీపీకి చుక్కలు చూపిస్తారో?
Discussion about this post