ఎన్నికలు అంటే మహా యజ్ఞమే అని చెప్పాలి. ఒక విధంగా ఎంత మంది వచ్చినా కూడా అక్కడ అసలు సరిపోరు అనే అంటారు. మరో వైపు ఏపీ రాజకీయాలు చూస్తే ఎన్నికలు అతి పెద్ద యుద్ధానే తలపిస్తాయి. ఒక వైపు మందీ మార్భలం, మరో వైపు అర్ధ, అంగ బలాలు, ఎత్తులు జిత్తులు అన్నీ కూడా చాలానే ఉంటాయి. పవన్ నాయకత్వంలోని జనసేన చతికిలపడింది కూడా అక్కడే. సరే 2019 ఎన్నికలు ఒక అనుభవంగా తీసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ 2024 నాటికి తగిన జాగ్రత్తలు తీసుకుంటారా అన్నదే చర్చగా ఉంది. పైగా పవన్ కి అప్పటికి రాజకీయాల్లో పదేళ్ళకు పైగా కెరీర్ పూర్తి చేసిన హిస్టరీ కూడా ఉంటుంది.

ఒక వైపు చంద్రబాబుతో బీజేపీతో పొత్తు ఉంటుందని చెబుతున్నాప్పటికీ పవన్ తనకు తానుగా ప్రూవ్ చేసుకోవడానికి ఆ ఎన్నికలు ఒక అవకాశాన్ని ఇస్తాయని అంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ రాజకీయానికి మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకూ ఉంటుంది అన్నది కూడా చూడాలంటున్నారు. పవన్ రాజకీయాల్లో ఇప్పటిదాకా పెద్దగా మెరుపులు మెరిపించలేదు. కానీ 2019 ఎన్నికల వేళ ఆయన అన్న కొడుకు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం గాజు గ్లాస్ అంటూ జనసేన ఎన్నికల గుర్తుని తన ఆడియో సభల్లో ప్రచారం చేసి పెట్టారు.

మరి ఈసారి రామ్ చరణ్ అక్కడితో ఆగిపోకుండా నేరుగా ప్రచారానికి వస్తారా అన్న ప్రశ్నలు కూడా పవర్ ఫ్యాన్స్ నుంచి వస్తున్నాయి. పవన్ బాబాయ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పే రామ్ చరణ్ ఆయన కోసం ఎన్నికల ప్రచారంలోకి దిగితే ఆ ఊపే వేరు అని ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. ఇక చరణ్ తో పాటు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా ప్రచారం చేస్తారా, అలాగే మెగా మేనళ్ళుల్లు సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా ప్రచారానికి వస్తారా అన్న చర్చ కూడా ఉంది.

అసలైన మూల విరాట్టు చిరంజీవి ఏం చేస్తారు అన్నది కూడా అసక్తికరమైన అంశమే. ఆయన తమ్ముడి పార్టీ కోసం కనీసం వీడియో సందేశాల ద్వారా అయినా ప్రచారం చేసినా జనసేన వచ్చే ఎన్నికల్లో అద్భుతాలు సృష్టిస్తుంది అన్న వారు ఉన్నారు. మొత్తానికి ఈసారి పవన్‌ను ఒంటరిగా రాజకీయ బరిలోకి పంపకూడదు అన్నదైతే మెగా ఫ్యామిలీలో ఉందని చెబుతున్నారు. అదే కనుక జరిగితే ఈసారి ఎన్నికలు కలర్ ఫుల్ గానే ఉంటాయన్న మాట.

Discussion about this post