గత ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ..జగన్ ప్రభుత్వంపై నిత్యం పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. జగన్ చేస్తున్న తప్పులని ఎత్తిచూపుతూ, మరోవైపు తమ నేతలు, కార్యకర్తలని కాపాడుకుంటూ చంద్రబాబు పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడుతున్నారు. నెక్స్ట్ ఎలాగైనా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో పొత్తు విషయంలో కూడా పార్టీలో కొన్ని చర్చలు జరుగుతున్నాయి.
ఒంటరిగానే పోటీ చేసి నెక్స్ట్ సత్తా చాటుదామని కొందరు తెలుగు తమ్ముళ్ళు చెబుతుంటే, పవన్‌ని కలుపుకుంటే ఇంకా ప్లస్ అవుతుందని మరికొందరు తమ్ముళ్ళు చెబుతున్నారు. 2014లో టీడీపీకి సొంతంగా గెలిచి అధికారంలోకి వచ్చే సత్తా ఉన్నా సరే, పవన్ సపోర్ట్ ఇవ్వడం వల్ల పార్టీకి కాస్త అడ్వాంటేజ్ అయిన మాట వాస్తవమే.అదే పవన్ వేరుగా పోటీ చేయడం వల్ల టీడీపీకి డ్యామేజ్ జరిగిన మాట కూడా నిజమే. జనసేన చాలా నియోజకవర్గాల్లో ఓట్లు చీల్చేయడం వల్ల టీడీపీకి నష్టం జరిగింది. అదే వైసీపీకి ప్లస్ అయింది. ముఖ్యంగా కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం లాంటి జిల్లాల్లో జనసేన భారీగా ఓట్లు చీల్చి, టీడీపీకి డ్యామేజ్ చేసింది. పలు నియోజకవర్గాల్లో టీడీపీ మీద వైసీపీకి వచ్చిన మెజారిటీల కంటే జనసేనకు వచ్చిన ఓట్లే ఎక్కువ. అంటే ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేసి ఉంటే, గత ఎన్నికల్లోనే వైసీపీకి చెక్ పెట్టేవారని కొందరు తమ్ముళ్ళు అంటున్నారు.
అలాగే టీడీపీ గెలవడంతో పాటు, జనసేనకు కూడా సీట్లు బాగానే వచ్చేవి, పవన్ పోటీ చేసిన రెండుచోట్ల గెలిచివారని చెబుతున్నారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేయకపోతే మళ్ళీ వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు అలాగే కలిసి పోటీ చేస్తే టీడీపీతో పాటు జనసేన కూడా లబ్ది పొందుతుందని తమ్ముళ్ళు మనసులో మాట చెబుతున్నారు. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికలకు రాజకీయాలు ఎలా ఉంటాయో?
Discussion about this post