పాలకొల్లు అంటేనే ఏపీలో అందరికీ ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. ఇది సినీ, రాజకీయ ప్రముఖలకు ఆల్వాలం అయిన ప్రాంతం. సినీ హాస్య దిగ్గజం అల్లు రామలింగయ్య, డైరెక్టర్ దాసరి నారాయణరావు ఇక్కడివారే. ఈ అసెంబ్లీ సీటు నుంచి ఎందరో ప్రముఖులు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. కాపులలో ప్రముఖ నేత అయిన చేగొండి హరి రామ జోగయ్య రెండు సార్లు పాలకొల్లు నుంచి గెలిచారు. ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఇక అల్లు రామలింగయ్యకు బంధువు అయిన అల్లు వెంకట సత్యనారాయణ టీడీపీ నుంచి నాలుగు సార్లు గెలిచి పాలకొల్లులో అత్యధిక కాలం ఎమ్మెల్యే అయిన నేతగా రికార్డు సృష్టించారు. ఇక వరసగా రెండు సార్లు ఈ సీటు నుంచి గెలిచిన వారిలో అల్లు వారి తరువాత నిమ్మల రామానాయుడు పేరు చెప్పుకోవాలి.

రామానాయుడు 2014లో తొలిసారి పాలకొల్లు నుంచి గెలిచారు. నాడు ఆయన తమ ప్రత్యర్ధి వైసీపీ అభ్యర్ధి మేకా శేషుబాబు మీద ఆరు వేల ఓట్ల మెజారిటీతో గెలిస్తే 2019 నాటికి జగన్ హవా బాగా ఉన్నా కూడా అంతకు మూడింతలు మెజారిటీ సాధించడం విశేషంగానే చెప్పుకోవాలి. ఆయన 2019లో వైసీపీ నుంచి పోటీ చేసిన సీ హెచ్ సత్యనారాయణమూర్తిని 18 వేల ఓట్ల తేడాతో ఓడించారు. రామనాయుడు పట్ల పాలకొల్లు జనాలకు అంత ప్రేమాభిమానాలు ఉన్నాయని అర్ధం చేసుకోవాలి. ఆయన ప్రస్తుతం టీడీపీ శాసనసభ పక్ష ఉప నాయకుడిగా ఉంటున్నారు. నిరంతరం ప్రజలలో ఉండడమే రామానాయుడు స్పెషాలిటీ. అంతే కాదు, ఆయనకు సబ్జెక్ట్ మీద మంచి పట్టుంది.

ఒక అంశాన్ని పట్టుకుని ఆయన అనర్గళంగా మాట్లాడగలరు. అసెంబ్లీలో అధికార వైసీపీని చిక్కుల్లో పడేయాలి అంటే రామానాయుడుని మించిన వారు లేరని అంటారు. ఒక దశలో జగన్ ఆయన మీద స్పీకర్ కి ఫిర్యాదు చేసిన సంగతి కూడా ఉందంటే రామానాయుడు టాలెంట్ ఏంటో అర్ధమవుతుంది. ఆయన మరోసారి కచ్చితంగా గెలుస్తారు అని ఇప్పటికే సర్వేలు చెబుతున్నాయి. ఇక్కడ వైసీపీ నేతల్లో వర్గ విబేధాలు కూడా నిమ్మలకు ప్లస్ కానున్నాయి.

అందువల్లనే 2019 ఎన్నికల వేళ టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణమూర్తిని తెచ్చి పోటీకి దించారు. ఇప్పటికి సగం కాలం గడచింది జగన్ ఇప్పుడున్న నేతలకే ఇక్కడ వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తారన్న గ్యారెంటీ కనపడడం లేదు. వచ్చే ఎన్నికలకు మళ్ళీ కొత్త ముఖాన్ని ఇక్కడ వైసీపీ పోటీకి పెట్టినా కూడా నిమ్మలను తట్టుకోలేరు అంటున్నారు. ఇక 2024లో టీడీపీ కనుక అధికారంలోకి వస్తే రామానాయుడుకు మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం ఎటూ ఉంది. దాంతో ఈసారి ఆయన్ని మరింత ఎక్కువ మెజారిటీతో జనాలే గెలిపించుకుంటారు అంటున్నారు.
Discussion about this post