జగన్ క్యాబినెట్ లో మంత్రులు గా ఉన్న నేతలలో సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా మామూలుగా లేదు. మిగిలిన మంత్రులు సంగతి ఎలా ? ఉన్నా పెద్దిరెడ్డి ఏం చేసినా… ఏం చెప్పినా కూడా ఎదురు లేకుండా పోతుంది. చిత్తూరు జిల్లా నుంచి మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి ఏపీ లో తన శాఖా పరంగా ఏ జిల్లాలో అయినా వేలు పెట్టేస్తున్నారని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ గా ఉన్నారు. పైగా ఆయన లోక్ సభలో వైసీపీ పక్ష నేతగా కూడా ఉన్నారు. పెద్దిరెడ్డిది జగన్ కు బాగా కావాల్సిన కుటుంబం. దీంతో పెద్ది రెడ్డి ఏ జిల్లాలో.. ఏ నియోజకవర్గంలో వేలు పెట్టినా పెద్దిరెడ్డిని ఎవరు విమర్శించే ధైర్యం చేయలేకపోతున్నారు. పార్టీలో పెద్దిరెడ్డి పై చాలామందికి కోపం ఉన్నా ఎవరు ఏం అనే పరిస్థితి లేదు.

ఇక చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి మిగిలిన నియోజకవర్గాల్లో కూడా వేలు పెట్టేసి ఉండటంతో వైసిపి ఎమ్మెల్యేలు అంతా గుర్రుగా ఉన్నారు. నగరి ఎమ్మెల్యే రోజా పెద్దిరెడ్డి పేరు చెబితేనే ఎంత కోపంతో ఉంటారో తెలిసిందే. రోజా పెద్దిరెడ్డి తనను పదే పదే టార్గెట్ చేస్తున్నారని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆమె కూడా ఈ విషయాన్ని పైకి చెప్పుకోలేక పోయినా లోలోన బాధపడుతున్నారు. జిల్లాకు చెందిన మరో మంత్రి నారాయణస్వామి – సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం – భూమన కరుణాకర్ రెడ్డి – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి నేతలు కూడా పెద్దిరెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు పెద్దిరెడ్డి బాధితుల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కూడా చేరిపోయారు. ఆయన నియోజకవర్గంలో ఉన్న శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ పదవిని సత్యవేడు నియోజకవర్గంలో ఉన్న బీరేంద్ర వర్మకు కేటాయించారు. పెద్దిరెడ్డి చక్రం తిప్పడంతోనే ఈ పదవి నాన్ లోకల్ వెళ్లిందని మధుసూదన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. ఈ పదవిని తన గెలుపు కోసం పని చేసిన తన నియోజక వర్గానికి చెందిన వారికి ఇప్పించుకోవాలని మధుసూదన్ రెడ్డి ప్రయత్నాలు చేశారు.అయితే ఈ పదవి సత్యవేడు నియోజకవర్గానికి వెళ్ళిపోయింది. ఏదేమైనా బియ్యపు మధుసూదన్ రెడ్డి పెద్దిరెడ్డి పై ఆగ్రహంతో ఉండడంతో ఆయన కూడా పెద్దిరెడ్డిని టార్గెట్ చేశారని గుసగుసలు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో వినిపిస్తున్నాయి.
Discussion about this post