నామినేటెడ్ పదవుల భర్తీలో జగన్ మార్క్ సామాజిక న్యాయం స్పష్టంగా కనిపించింది. దాంతో ఎవరూ వేలెత్తి చూపించలేని పరిస్థితి ఉంది. అయితే కొన్ని చోట్ల అతికి పోయి జిల్లా మంత్రులు చేసిన రాజకీయంతో స్థానిక ఎమ్మెల్యేలు గుస్సా అవుతున్నారు. జగన్ పట్ల తమకు అపారమైన గౌరవం, అభిమానం కూడా ఉందని వారు అంటున్నారు. అయితే కొన్ని కీలకమైన పదవుల విషయంలో మరీ లోకల్ ఎమ్మెల్యేలను సంప్రదించకుండా క్యాడర్ ముందు చెడ్డ చేశారని వారు మండిపోతున్నారు. ఈ విధంగా చిత్తూరు జిల్లాలోలో సాగిన పందేరంలో రెండు నామినేటెడ్ పదవులు స్థానికేతరులు తన్నుకుపోయారని ఎమ్మెల్యేల అనుచరులు గుర్రుమంటున్నారు.
చిత్తూరు జిల్లాలో రెండు ప్రఖ్యాత ఆలయాలు ఉన్నాయి. అందులో ఒకటి శ్రీకాళహస్తి. ఈ ఆలయం సుప్రసిద్ధమైనది. రాష్ట్ర స్థాయిలో గురింపు పొందినది. ఈ ఆలయ కమిటీ చైర్మన్ పదవి కోసం శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి తన వారి పేర్లను పరిశీలించాలని ఇప్పటికే కోరి ఉన్నారు. అయితే ఆయన మాటను కనీసం ఖాతరు చేయకుండా పక్క నియోజకవర్గం సత్యవేడు నుంచి బీరేంద్ర వర్మ అనే నాయకుడిని తీసుకునివచ్చి మరీ కాళహస్తీ ఆలయ చైర్మన్ గిరీని కట్టబెట్టేశారు. దీంతో జగన్ కి అత్యంత ఆప్తుడు అయిన బియ్యపు మధుసూదనరెడ్డి అయితే తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. ఇందంతా జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి చేయించారని కూడా ఆరోపిస్తున్నారుట.ఇప్పటికే పెద్దిరెడ్డి వర్సెస్ మధుసూధన్ రెడ్డి మధ్య తీవ్ర యుద్ధం నడుస్తోంది. తాజా సంఘటనతో ఇది మరింత ముదరడంతో పాటు శ్రీకాళహస్తిలో మధుసూధన్ రెడ్డికి పెద్దిరెడ్డి పొగ పెట్టేలా వ్యవహరిస్తున్నారన్న టాక్ ఓపెన్ అయిపోయింది. ఇక ఇదే జిల్లాలో మరో సుప్రసిద్ధ ఆలయం ఉంది. కాణీపాకంలోని వినాయకుడి ఆలయం చాలా ఫేమస్. ఈ ఆలయ కమిటీ చైర్మన్ పదవిని కూడా మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి వదిన చిత్తూరుకు చెందిన ప్రమీలమ్మ రెడ్డికు ఇచ్చేశారు. స్థానికంగా ఉన్న వారికి ఇవ్వకుండా ఎక్కడో ఉన్న వారికి ఈ ఆలయ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడమేంటని లోకల్ ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు మీద కేడర్ మండిపోతున్నారు.
ఆయనను కలసి వెంటనే చైర్మన్ పదవిని మార్చి లోకల్స్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ఎమ్మెల్యే బాబు తన నిస్సహాయత వ్యక్తం చేయడంతో హైకోర్టుకు పోతామని కూడా వైసీపీ నేతలు హెచ్చరించడం విశేషం. మొత్తానికి జగన్ మార్క్ పదవుల పంపిణీలో ఇలా కొన్ని చోట్ల లీడర్లు, క్యాడర్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషంగానే చూడాలి.
Discussion about this post