కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో చాలా వింత రాజకీయాలు నడుస్తున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలకు చెందిన మంత్రి పేర్ని నాని, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణలు పరోక్షంగా ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ముందుకెళుతున్నారు. ఇప్పుడు వీరి మధ్య ఉండే సన్నిహిత సంబంధాలు వల్ల టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా నష్టపోయేలా కనిపిస్తున్నారు. మొదట నుంచి ఈ నియోజకవర్గంలో కొనకళ్ళ, పేర్ని ఫ్యామిలీల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.

పైగా వీరు ముందు నుంచి వేరు వేరు పార్టీల్లో రాజకీయాలు చేస్తున్నారు. కొనకళ్ళ టీడీపీలో ఉంటే, పేర్ని కాంగ్రెస్‌లో ఉన్నారు. అలా పార్టీలు వేరైనా వ్యక్తిగతంగా మాత్రం వీరి రాజకీయం ఒకటే. అందుకే 2009 ఎన్నికల్లో సైతం వీరు…ఒకరి గెలుపు కోసం ఒకరు సహకరించుకున్నారు. కొనకళ్ళ ఏమో టీడీపీ తరుపున బందరు ఎంపీగా పోటీ చేస్తే, పేర్ని ఏమో కాంగ్రెస్ తరుపున బందరు ఎమ్మెల్యేగా నిలబడ్డారు.అప్పుడే ఎంపీ ఓటు తనకు వేసి, ఎమ్మెల్యే ఓటు ‘మన అబ్బాయ్’ పేర్నికి వేయాలని కొనకళ్ళ ప్రచారం చేశారు. ఇక ఎమ్మెల్యే ఓటు తనకు వేసి, ఎంపీ ఓటు ‘మన బాబాయ్’ కొనకళ్ళకు వేయాలని పేర్ని ప్రచారం తిరిగారు. వీరి ప్రచారం బాగానే సక్సెస్ అయింది. కొనకళ్ళ ఎంపీగా గెలిస్తే, పేర్ని ఎమ్మెల్యేగా గెలిచారు. మధ్యలో టీడీపీ తరుపున బందరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన కొల్లు రవీంద్ర నష్టపోయారు.

అయితే ఇప్పటికీ పేర్ని-కొనకళ్ళ బంధం అలాగే కొనసాగుతుంది. పైగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొనకళ్ళ, పేర్నికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో పేర్ని, కొనకళ్ళకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు. ఇక ఈ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భాలు లేవు.ఇలా ఇద్దరు నేతలు బంధం…కొల్లుకు పెద్దగా గండంగా మారాయి. ఇప్పటికే వ్యక్తిగతంగా కొల్లుని, వైసీపీ ఎలాంటి ఇబ్బందులకు గురిచేసిందో తెలిసిందే. అయితే కొనకళ్ళ నుంచి కొల్లుకు పెద్ద సపోర్ట్ కూడా రావడం లేదు. పైగా వచ్చే ఎన్నికల్లో కూడా పేర్ని-కొనకళ్ళ అలాగే రాజకీయం చేస్తే కొల్లుకు ఇబ్బంది అవుతుంది. మొత్తానికైతే కొనకళ్ళ-పేర్ని బంధం కొల్లు కొంపముంచేలా ఉంది.
Discussion about this post