జగనన్న కాలనీల పేరిట ఏపీ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక అందులో పేదలనే ఇళ్ళు కట్టుకోమని, తాము కేవలం కేంద్రం ఇచ్చే లక్షా 80 వేలు మాత్రమే ఇస్తానని జగన్ ప్రభుత్వం చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రభుత్వం ఇచ్చిన సెంటు, సెంటున్నర స్థలాల్లోనే పేదలు ఇళ్ళు కట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఆ స్థలాల్లో వైసీపీ నేతలు ఎన్ని రకాలుగా అక్రమాలు చేశారు, ఆ స్థలాల్లో ఎంత ఇల్లు పడుతుందనే విషయం పక్కనబెడితే, ఇప్పుడు జగనన్న కాలనీల్లో ఇళ్ళు కట్టుకునే వరకు జగన్ ప్రభుత్వం స్విమ్మింగ్ ఫూల్స్ కూడా ఏర్పాటు చేసే ప్రక్రియ జరుగుతుందని తెలుస్తోంది.
అదేంటి ఇచ్చే సెంటు భూమిలో స్విమ్మింగ్ పూల్ ఎక్కడ వస్తుందని అందరికీ డౌట్ రావొచ్చు. అసలు ఇళ్లే లేకుండా కేవలం స్విమ్మింగ్ పూల్ మాత్రమే ఆ స్థలంలో కనిపిస్తున్నాయి. తాజాగా కురుస్తున్న వర్షాలకు కాలనీలు నీట మునిగాయి. దీంతో పేదల ఇళ్ల స్థలాల్లో కొత్తగా స్విమ్మింగ్ ఫూల్స్ వచ్చాయి. కొన్నిచోట్లైతే కాలనీలు పెద్ద పెద్ద చేపల చెరువులనే తలపిస్తున్నాయి.
మరి ఇదంతా వైసీపీ నేతల ఘనతే అని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎక్కడో వూరు బయట స్థలాలు ఇవ్వడం, లేదంటే చెరువులు, కాలువలు పక్కన ఇవ్వడంతోనే ఈ పరిస్తితి వచ్చిందని అంటున్నారు. పైగా స్థలాల్లో మెరక పేరుతో వైసీపీ నేతలు అక్రమాలు చేశారని, మరి మెరక ఎక్కడ చేశారో వాళ్ళకే తెలియాలని ఫైర్ అవుతున్నారు. ఒక్క చోటని కాదు చాలా నియోజకవర్గాల్లో కాలనీలు స్విమ్మింగ్ ఫూల్స్ అయిపోయాయని అంటున్నారు. మొత్తానికైతే జగన్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇల్లు ఇవ్వకుండా స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
Discussion about this post