శ్రీకాకుళం జిల్లా అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి జిల్లా అనే సంగతి తెలిసిందే. ఏ ఎన్నికల్లోనైనా జిల్లాలో టీడీపీకి మంచి ఫలితాలు వచ్చేవి. కానీ గత ఎన్నికల్లోనే కాస్త రివర్స్ అయింది. జిల్లాలో వైసీపీ హవా నడిచింది. జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లు ఉంటే 8 గెలుచుకుంది, టీడీపీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇక ఎంపీ సీటు మాత్రం టీడీపీ ఖాతాలోనే పడింది.

అయితే జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కింజరాపు ఫ్యామిలీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. బాబాయి-అబ్బాయిలైన అచ్చెన్నాయుడు-రామ్మోహన్ నాయుడులు టీడీపీని మళ్ళీ వైసీపీకి ధీటుగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి ఓ కఠిన పరీక్ష ఎదురుకానుండి. ఇప్పటికే పంచాయితీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ హవా నడిచిన విషయం తెలిసిందే.ఇక కీలకమైన శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నిక మాత్రం వాయిదా పడింది. అయితే వాయిదా పడిన కార్పొరేషన్ స్థానాలతో పాటు, మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించడానికి ఎస్‌ఈసి నీలం సాహ్ని రెడీ అవుతున్నారు. శ్రీకాకుళం, నెల్లూరు కార్పొరేషన్లతో పాటు 11 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు లేవని అధికారులు ఎస్‌ఈసీ నీలం సాహ్ని దృష్టికి తీసుకురాగా, అతి త్వరలోనే ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి నీలం సాహ్ని సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

అయితే శ్రీకాకుళం కార్పొరేషన్‌లో టీడీపీని గెలిపించాల్సిన బాధ్యత ఎక్కువగా అచ్చెన్న-రామ్మోహన్‌ల మీదే ఉందని చెప్పొచ్చు. కాకపోతే పరిస్థితులు మాత్రం టీడీపీకి అనుకూలంగా లేవు. ఇటీవల జరిగిన కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. అలాంటప్పుడు శ్రీకాకుళంలో వైసీపీ హవా నడవటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక వైసీపీ హవాని తట్టుకుని టీడీపీని ఎంతవరకు గెలిపిస్తారనేది బాబాయి-అబ్బాయిల చేతిలోనే ఉన్నట్లు కనిపిస్తోంది.
Discussion about this post