మొత్తానికి తెలుగుదేశం పార్టీలో కొత్త హుషార్ కనిపిస్తోంది. ముందున్నవి అన్నీ మంచి రోజులే, అవి మా రోజులే అని తమ్ముళ్ళు అనుకునే వాతావరణం అయితే ఉంది. వైసీపీ సర్కార్ దూకుడుకు ఎప్పటికపుడు చెక్ పెడుతూ సాగిన అపర చాణక్యుడు చంద్రబాబు ఇపుడు టీడీపీ బండి గేరు మార్చి స్పీడ్ పెంచుతున్నారు. వైసీపీలో ఉత్సాహం మెల్లగా చప్పబడుతూండగా, మరో వైపు టీడీపీలో కొత్త ఆశలు పెరుగుతున్నాయి.
ఇంతకాలం అంతుబట్టని రాజకీయం ఇపుడు సానుకూలంగా మారుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశానికి అన్నీ మంచి శకునములే కనిపిస్తున్నాయి. ఎంత కాదన్నా కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక చోట జరిగే పరిణామాలు మరో చోట కచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. తెలంగాణాలో టీడీపీ వ్యవహారాలను సరిదిద్దుకోవడం ద్వారా అటూ ఇటూ తానే గట్టిగానే ఉంటానని ఆ పార్టీ తెలియచెబుతోంది.
తెలంగాణాలో ఇపుడు రేవంత్ రెడ్డి కొత్త పీసీసీ చీఫ్ అయ్యాడు. ఒక విధంగా ఇది తెలుగుదేశానికి సానుకూల అంశంగానే చూడాలి. రేవంత్ రెడ్డి మూడేళ్ల క్రితం వరకూ టీడీపీలోనే ఉన్న నాయకుడు. అందువల్ల ఆయన ఇపుడు జాతీయ పార్టీలో ఎదిగి రావడం అంటే టీడీపీకి అది మేలు చేసే పరిణామమే తప్ప మరోటి కాదు. తెలంగాణాలో టీడీపీ రాజకీయానికి ఒక వైపు టీయారెస్ మరో వైపు బీజేపీ అడ్డుగా మారుతున్నాయి. ఇపుడు కాంగ్రెస్ తరఫున రేవంత్ జోరు పెంచితే ఈ రెండు పార్టీలే ఇబ్బంది పడతాయి.
అదే సమయంలో టీడీపీ మళ్ళీ తన బలాన్ని పెంచుకుని తనకంటూ ఒక రాజకీయ వాటాను ఈ ప్రాంతంలో పొందే అవకాశం ఉంటుంది.ఇక ఏపీలో చూసుకుంటే కచ్చితంగా దీని ప్రభావం ఉంటుంది. దేశంలో మోడీ వేవ్ అంతకంతకు తగ్గిపోతున్న తరుణంలో కాంగ్రెస్ రేపటి రోజున జాతీయ స్థాయిలో ఆల్టర్నేషన్ అవుతుంది అన్న లెక్కలు ఉన్నాయి. ఈ పరిస్థితులలో కాంగ్రెస్ లో ఒకనాటి టీడీపీ కీలక నేత రేవంత్ ఉండడం ఏపీలోనూ కలసివచ్చే అంశమే. తెలుగుదేశం ఇప్పటికిపుడు తన భవిష్యత్తు రాజకీయం విప్పి చెప్పకపోయినా అన్ని ఆప్షన్లూ అందుబాటులో ఉంచుకుందనే చెప్పాలి.
అదే సమయంలో వైసీపీ జాతీయ రాజకీయం ఆ పార్టీ నేతలకే అర్ధం కావడం లేదు. ప్రాంతీయంగా ఎవరూ మిత్రులు కారు, దీంతో ఆ పార్టీ ఒంటరి తనమే వచ్చే ఎన్నికల్లో ఓటమికి కారణం అయినా ఆశ్చర్యం లేదు అన్న విశ్లేషణలు ఉన్నాయి. మొత్తానికి టీడీపీని బాబు కంఫర్ట్ జోన్ లోకి తెచ్చారనే అంటున్నారు అంతా..!
Discussion about this post