విశాఖపట్నం జిల్లా అంటే మొదట నుంచి కాస్త టీడీపీకి అనుకూలమైన జిల్లానే. ఎప్పుడు ఎన్నికలు జరిగిన ఈ జిల్లాలో టీడీపీకి మంచి ఫలితాలే వచ్చేవి. అయితే గత ఎన్నికల్లోనే ఈ జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇక ఈ దెబ్బ నుంచి కోలుకునేందుకు టీడీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. అయితే జిల్లాలో మిగతాచోట్ల టీడీపీ పరిస్తితి కాస్త మెరుగ్గానే కనిపిస్తున్నా, అరకు పార్లమెంట్‌లో మాత్రం టీడీపీకి ఏ మాత్రం అనుకూలమైన పరిస్తితులు లేవనే చెప్పొచ్చు.

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో ఏర్పడిన ఈ అరకు పార్లమెంట్ స్థానంలో టీడీపీ ఇంతవరకు గెలవలేదు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వచ్చింది. పైగా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్లలో కూడా టీడీపీ సత్తా చాటలేకపోతుంది. నాలుగు జిల్లాల్లోని ఏడు నియోజకవర్గాలతో ఏర్పడిన ఈ పార్లమెంట్ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా ఉంటారు.ఇందులో ఆరు నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వడ్ కాగా, ఒకటి ఎస్సీ రిజర్వడ్. పాలకొండ, కురుపాం, సాలూరు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వడ్, ఒక్క పార్వతీపురం ఎస్సీ రిజర్వడ్. అయితే ఈ నియోజకవర్గాల్లో కూడా వైసీపీ హవానే ఉంది. 2014లో రాష్ట్రంలో టీడీపీ వేవ్ ఉంటే, అరకులో మాత్రం వైసీపీ హవా నడిచింది. ఒక్క పార్వతీపురం మినహా మిగిలిన అన్నీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచింది. 2019 ఎన్నికల్లో అయితే క్లీన్‌స్వీప్ చేసింది.

ఇక ఇప్పటికీ ఆ పార్లమెంట్ పరిధిలో వైసీపీ ఆధిక్యమే కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ఆ ప్రాంత ప్రజలు పక్కగా వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. ప్రభుత్వ పథకాలు ఇక్కడ ప్రజలకు బాగా ఉపయోగపడుతున్నాయి. అందుకే ఇంకా అక్కడ టీడీపీకి అనుకూల వాతావరణం లేదు. కాస్తో కూస్తో పార్వతీపురంలో టీడీపీకి కొంచెం ఎడ్జ్ కనిపిస్తోంది. మిగిలిన 6 నియోజకవర్గాల్లో, అరకు పార్లమెంట్ స్థానంలో వైసీపీ డామినేషన్ ఉంది. కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ టీడీపీ గెలుపు మరిచిపోవాల్సిన పరిస్తితి ఉన్నట్లు కనిపిస్తోంది.
Discussion about this post