చిత్తూరు జిల్లా చంద్రగిరి…టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన నారావారిపల్లె గ్రామం ఉన్న నియోజకవర్గం. అసలు చంద్రబాబు రాజకీయ జీవితం మొదలైందే చంద్రగిరి నుంచే…1978లో చంద్రబాబు చంద్రగిరి నుంచి తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 1983లో చంద్రబాబు ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు టీడీపీలోకి వచ్చాక కుప్పం నుంచి బరిలో దిగుతూ వస్తున్నారు.

బాబు టీడీపీలోకి వచ్చిన కూడా చంద్రగిరిలో టీడీపీ జెండా ఎగరడం తక్కువైపోయింది. 1983, 1985, 1994 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ టీడీపీ జెండా ఎగిరింది. ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలవగా, గత రెండు పర్యాయాలు ఇక్కడ వైసీపీ విజయం సాధిస్తూ వస్తుంది. వైసీపీ తరుపున చెవిరెడ్డి భాస్కరరెడ్డి గెలుస్తూ వస్తున్నారు. 2014లో కేవలం 4 వేల ఓట్ల తేడాతో గల్లా అరుణ కుమారిపై గెలిచిన చెవిరెడ్డి, 2019 ఎన్నికల్లో పులివర్తి నానిపై 41 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

రెండోసారి గెలిచాక చెవిరెడ్డి, చంద్రగిరిలో మరింతగా స్ట్రాంగ్ అయ్యారు. ఇక్కడ ఆయనకు ఎదురులేకుండా పోయింది. పైగా వైసీపీ అధికారంలో ఉండటం ఆయనకు కలిసొస్తుంది. అదేవిధంగా ఎమ్మెల్యేగా కూడా చెవిరెడ్డి బాగానే పనిచేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ఆయనకు ప్లస్ అవుతున్నాయి. అయితే చెవిరెడ్డికి చెక్ పెట్టాలని పులివర్తి నాని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి బాగానే కష్టపడుతున్నారు గానీ, అనుకున్న మేర మాత్రం చెవిరెడ్డిని నిలువరించలేకపోతున్నారు.

ఇప్పుడున్న పరిస్తితుల్లో చంద్రగిరిలో చెవిరెడ్డి బలం ముందు నాని తేలిపోతున్నట్లే కనిపిస్తోంది. అయితే అధినేత చద్రబాబు, తన సొంతగడ్డపై స్పెషల్ ఫోకస్ పెట్టి పని చేయాల్సిన అవసరముంది. నియోజకవర్గంలో మళ్ళీ టీడీపీని గాడిలో పెట్టాలి. ఈ సారైనా ఇక్కడ పార్టీ గెలవకపోతే, టీడీపీ మనుగడకే ప్రమాదం. కానీ పరిస్తితులు టీడీపీకి అనుకూలంగా మాత్రం లేవు. మరి చంద్రబాబు సొంత గడ్డలో టీడీపీ ఎప్పుడు గెలుస్తుందో?
Discussion about this post