ఏపీలో ప్రత్యేక హోదా అస్త్రం ఇంకా పదునుగానే ఉంది. దానిని సరిగ్గా గురి చూసి ప్రయోగిస్తే అధికార పక్షం రాజకీయం గింగిరాలు తిరగాల్సిందే. ఏపీలో ప్రత్యేక హోదా తెస్తామని, కేంద్రం మెడలు వంచుతామని ఎన్నో కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఇపుడు మడమ తిప్పేశారు. నాలిక మడతేశారు. సరిగ్గా ఇక్కడే జగన్ టీడీపీకి అడ్డంగా దొరికేశారు అంటున్నారు. హోదా ఏది జగన్ అంటూ ఇపుడు టీడీపీ ఎదురు ప్రశ్నిస్తోంది.
దీని మీద తెలుగుదేశం అధినాయత్వం సీరియస్ గానే ఉందని అంటున్నారు. హోదా అన్నది జనాలలో సజీవంగా ఉన్న డిమాండ్. తిమ్మిని బమ్మి చేసి అధికారాన్ని పట్టేశాం కాబట్టి జనాలు హోదాను మరచిపోతారని వైసీపీ నేతలు అనుకుంటే పొరపాటే అంటున్నారు. హోదా విషయంలో జగన్ నాడు అన్న మాటలు, యువ భేరీ పేరిట ఊరూరా తిరిగి చేసిన ఆవేశపూరిత ప్రసంగాలే ఇపుడు టీడీపీకి అసలైన ఆయుధాలుగా మారబోతున్నాయి. హోదా పోరులో అగ్ర భాగాన నిలిచి జగన్ని ఇరుకున పెట్టేందుకు టీడీపీ తయారుగా ఉందని అంటున్నారు.ఈ మేరకు పార్టీ ఒక సర్వే చేయిస్తోందని తెలుస్తోంది. ప్రజలలో హోదా ఆకాంక్ష ఎంత బలంగా ఉంది. ముఖ్యంగా యువత దీని మీద ఎంత మేరకు అవగాహన కలిగి ఉన్నారు. హోదా అంశం మీద వైసీపీ వేసిన పిల్లి మొగ్గల మీద జనాల రియాక్షన్ ఏంటి అన్న పాయింట్లతో టీడీపీ ఒక సర్వే చేయిస్తోందని అంటున్నారు. ఆ సర్వే ఫలితాలు అందిన వెంటనే కార్యాచరణ ప్రకటించి బరిలోకి దిగిపోతారు అంటున్నారు. టీడీపీ కనుక హోదా అస్త్రంతో పోరు సలిపితే తట్టుకోవడం అధికార పార్టీకి కష్టమే అంటున్నారు.
హోదా విషయంలో అటు మోడీని అడగలేక, ఇటు జనాలలో పెరుగుతున్న అసహనాన్ని ఆపలేక అధికార పార్టీ సతమతం కావడం ఖాయమని అంటున్నారు. ఇలా అన్ని విషయాలు ఆలోచించే టీడీపీ వైసీపీ మీద హోదా అస్త్రాన్ని ప్రయోగించాలని చూస్తోందిట. మరో ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఈసారి ప్రజా సంఘాలు కూడా హోదా మీద గట్టి పోరాటామే చేయనున్నాయి. అంటే వైసీపీ సర్కార్ పద్మవ్యూహంలోకి నెట్టబడుతోంది అన్నది అక్షర సత్యమే అంటున్నారు.
Discussion about this post