నువ్వు కొట్టినట్లు నటించు, నేను ఏడ్చినట్లు నటిస్తా….ఇదే ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌ల మధ్య జరుగుతున్న జగన్నాటకమని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శ. మొన్నటివరకు కేసీఆర్-జగన్‌ల మధ్య ఎలాంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. అలాంటిది ఒక్కసారిగా వారి మధ్య రచ్చ మొదలైంది. చర్చలతో సామరస్యంగా కృష్ణా జలాల విషయంలో సమస్యని పరిష్కరించుకోకుండా, దాన్ని మరింత పెద్దగా చేస్తూ మాటల యుద్ధానికి దిగారు.
అసలు ఏపీ ప్రభుత్వం కడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టుని తెలంగాణ నీళ్లని జగన్ దోచుకుంటున్నారని కేసీఆర్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. కాదు కాదు ఈ ప్రాజెక్టు సక్రమంగానే కడుతున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇక తెలంగాణ మంత్రులు అయితే ఓ రేంజ్‌లో జగన్, వైఎస్సార్‌లని తిడుతున్నారు. ఏపీలో ప్రతిపక్ష టీడీపీ నేతలని బూతుల పంచాంగంతో దూషించే ఏపీ మంత్రులు మాత్రం, శాంతి జపం చేస్తూ, తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలని ఖండించే పనిలో ఉన్నారు.
పైగా తాము ఏమన్నా విమర్శలు చేస్తే హైదరాబాద్‌లో మనవాళ్ళకు ఇబ్బంది అవుతుందని జగన్ కామెంట్ చేయడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. అసలు నీటి విషయంలో గొడవ పడటం ఏంటి, జగన్ ఏమో హైదరాబాద్‌లో ప్రశాంతంగా ఉన్న ఏపీ ప్రజల గురించి మాట్లాడటం ఏంటని విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. జగన్ అలా అనగానే తెలంగాణ మంత్రులు ఆంధ్రా ప్రజలని కంటికి రెప్పలా కాపాడుకుంటామని స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తున్నారు.
అసలు చర్చించుకుంటే సమస్య పరిష్కారమైపోతుందని, కానీ కేసీఆర్-జగన్‌లు రాజకీయంగా ప్రయోజనం పొందటానికే ఇలా రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కావాలనే సెంటిమెంట్ రాజేసి రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికైతే కేసీఆర్-జగన్‌లు అద్భుతమైన పర్ఫామెన్స్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
Discussion about this post