జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పైగా ఆ నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడకపోగా, వివాదాస్పదం అవుతున్నాయి. ఆ నిర్ణయాలపై టిడిపి అధినేత చంద్రబాబు నిత్యం పోరాడుతున్నారు. అయితే ఆ నిర్ణయాలు తప్పని తెలిసికూడా జగన్ ప్రభుత్వం వాటిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే తెలుగు మీడియం పక్కనబెట్టి కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని చూస్తున్న జగన్ ప్రభుత్వం, దశాబ్దాలపాటు తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న తెలుగు అకాడమీ పేరు మార్చి ఇప్పుడు దాని ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నారు.
తెలుగు అకాడమీ పేరుని తెలుగు సంస్కృత అకాడమీగా మారుస్తున్నారు. దీనిపై తెలుగు భాషాభిమానులు, మేధావులు, రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. తెలుగు అకాడమీ పేరు అలాగే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అకాడమీ పేరుని అలాగే ఉంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయినా సరే జగన్ ప్రభుత్వం ఈ విషయంలో ముందుకెళ్లేలా కనిపిస్తుంది.ఇక అకాడమీ పేరు మార్పుని ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతులు జగన్ ప్రభుత్వం చేస్తున్న పని సమర్ధిస్తున్నారు. తెలుగు-సంస్కృత అకాడమీ అని పేరు మార్చడం వల్ల వచ్చే నష్టం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అలాగే దీనివల్ల తెలుగు భాషతో పాటు సంస్కృత భాష కూడా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు.
అలాగే దీనిపై విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదని మాట్లాడుతున్నారు. అయితే ఇలా మాట్లాడుతున్న లక్ష్మీపార్వతి, యార్లగడ్డలకు తెలుగుదేశం శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి. అసలు తెలుగు అకాడమీ చైర్ పర్సన్‌గా లక్ష్మీపార్వతికి ఉండే అర్హత లేదని విమర్శిస్తున్నారు. అటు యార్లగడ్డకు అధికార భాష అధ్యక్షుడిగా ఉండడానికి అర్హత లేదని అన్నారు. ఇలా తెలుగు భాషను నాశనం చేస్తూ అకాడమీ పేరు మార్పుని సమర్థిస్తూ కూర్చున్న ఈ మేధావుల్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు.
Discussion about this post