శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఈ సారి బావాబామ్మర్దుల మధ్య ఆసక్తికరమైన ఫైట్ జరిగేలా కనిపిస్తోంది. స్పీకర్ తమ్మినేని సీతారాం. టిడిపి నేత కూన రవికుమార్‌ల మధ్య టఫ్ ఫైట్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే తమ్మినేని, కూనలు సొంత బావాబామ్మర్దులు అనే సంగతి తెలిసిందే. అసలు కూన, తన బావ తమ్మినేని వెనుక ఉండే రాజకీయం నేర్చుకున్నారు. మొదట నుంచి టిడిపిలో పనిచేస్తూ వచ్చిన తమ్మినేని…ఆమదాలవలస నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇక 2009 ఎన్నికల్లో మాత్రం ప్రజారాజ్యంలోకి ఆ పార్టీ తరుపున బరిలో దిగారు. కానీ తమ్మినేని బామ్మర్ది కూన మాత్రం టిడిపిలోనే కొనసాగి, ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఇద్దరు ఓడిపోగా, కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక 2014 ఎన్నికల్లో బావాబామ్మర్దుల అసలు ఫైట్ జరిగింది. టిడిపి నుంచి కూన, వైసీపీ నుంచి తమ్మినేని తలపడ్డారు. అయితే 5 వేల ఓట్ల మెజారిటీతో కూన విజయం సాధించారు. పైగా టిడిపి అధికారంలోకి రావడంతో కూన తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళ్లారు.

ఇక 2019 జగన్ వేవ్‌లో కూనపై తమ్మినేని పైచేయి సాధించారు. ఇక వైసీపీ అధికారంలోకి రావడంతో తమ్మినేని స్పీకర్ కూడా అయ్యారు. ఓ వైపు స్పీకర్‌గా, మరో వైపు ఎమ్మెల్యేగా తమ్మినేని పనిచేస్తున్నారు. ఇటు కూన సైతం ఆమదాలవలసలో దూకుడుగా పనిచేస్తున్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు.

అలాగే శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్షుడుగా కూడా కూన అధికార వైసీపీపై విరుచుకుపడుతున్నారు. ఆమదాలవలసలో టిడిపిని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన బావ తమ్మినేనికి చెక్ పెట్టి ఆమదాలవలసలో టిడిపి జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. అయితే ఇప్పుడుప్పుడే అధికార వైసీపీపై వ్యతిరేకత పెరగడం కూనకు కలిసొచ్చే అవకాశం ఉంది. మరో రెండేళ్ళు ఇలాగే కష్టపడితే తమ్మినేనికి కూన చెక్ పెట్టే ఛాన్స్ ఉంది.

Discussion about this post