విశాఖ టీడీపీకి మూల విరాట్టు దివంగంత నేత డాక్టర్ ఎంవీవీస్ మూర్తి అని చెబుతారు. అది అక్షర సత్యం కూడా. తెలుగుదేశం పార్టీ పెట్టకముందు, పుట్టకముందే మూర్తి విశాఖకు వచ్చారు. ఆయన 80 దశకంలో యువ పారిశ్రామికవేత్తగా విశాఖలో తన ప్రస్థానం ప్రారంభించారు. ఇక అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన గీతం విశ్వవిద్యాలయాన్ని కూడా ఆయన ఆనాడే స్థాపించారు. అది ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతోంది అంటే నాడు మూర్తి దీని స్థాపన వెనక తీసుకున్న బలమైన సంకల్పం అనే చెబుతారు. ఇదిలా ఉంటే మూర్తి బహుముఖీయమైన ప్రతిభను చూసి ఎన్టీయార్ నాడు పిలిచి మరీ టీడీపీలో చేర్చుకున్నారు. అలా చాలా కాలం పాటు మూర్తి టీడీపీలో పనిచేసి విశాఖలో పార్టీని అభివృద్ధి చేశారు తప్ప పదవులు కోరుకోలేదు.
ఇక ఎన్టీయార్ బలవంతం మీద 1989లో ఆయన విశాఖ నుంచి ఎంపీగా పోటీకి దిగారు. తొలి విడత ఓడినా 1991లో గెలిచారు. ఆ తరువాత నుంచి ఆయన రెండు సార్లు విశాఖ నుంచి ఎంపీగా గెలిచి పదేళ్ళ కాలంలో విశాఖకు ఎంతో మేలు చేశారు. ఆయన మూడేళ్ళ క్రితం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇక మూర్తి వారసుడిగా రంగంలోకి దిగిన మనవడు శ్రీభరత్ 2019 ఎన్నికలో విశాఖ ఎంపీగా పోటీ చేసి కేవలం మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. నాడు జనసేన కనుక బరిలో ఉండకపోతే కచ్చితంగా లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో శ్రీభరత్ గెలిచేవారు. ఇక పోతే గత రెండేళ్ళుగా భరత్ విశాఖలో టీడీపీని బలోపేతం చేయడం పైనే దృష్టి పెట్టారు.ప్రత్యేకించి ఆయన విశాఖ సౌత్, భీమిలీలలో పార్టీని గాడిన పెడుతున్నారు. ఇందులో భీమిలీకి ఇంచార్జిని టీడీపీ అధినాయకత్వం నియమించింది. ఇక విశాఖ సౌత్ కి కూడా త్వరలోనే మరో నేతకు అవకాశం ఇస్తారు. విశాఖ సిటీలో టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గంగా ఉత్తరం ఉంది. ఇక్కడ నుంచి 2019 ఎన్నికలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గెలిచారు. ఆయన ఈ మధ్య విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనకు నిరసనగా తన పదవికి రాజీనామా చేశారు. అది స్పీకర్ పరిశీలనలో ఉంది. గంటా మళ్లీ అక్కడ నుంచి పోటీ చేయను అని కూడా అంటున్నారు. దాంతో ఉత్తరం మీద శ్రీభరత్ తాజాగా దృష్టి పెట్టారు. అక్కడ పార్టీని అన్ని రకాలుగా పటిష్టం చేయాలని కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు.
2024లో ఎన్నికలు జరిగితే కచ్చితంగా ఎమ్మెల్యే సీటుకే భరత్ పోటీ చేస్తారు అంటున్నారు. విశాఖ ఉత్తరం నుంచి ఆయన పోటీకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా ప్రచారం సాగుతోంది. మిగిలిన చోట్లకు గట్టి నాయకులు ఉన్నారు. ఉత్తరంలో పార్టీ ఉంది కానీ సరైన లీడర్ లేరు. దాంతో ఆ లోటును భర్తీ చేయడానికి తానే దిగాలని ఆలోచిస్తున్నారు అని చెబుతున్నారు. అధినాయకత్వం కూడా భరత్ ప్రతిపాదనకు సుముఖంగా ఉందని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఎమ్మెల్యేగా భరత్ పోటీ చేయడం వల్ల విశాఖలోని మిగిలిన సీట్ల మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది, అలా కచ్చితంగా టీడీపీ విశాఖ సిటీలో విజయం సాధించడం ఖాయమే అంటున్నారు.
Discussion about this post