ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బీసీల ఆత్మగౌరవం నిలబెడుతున్నారని, బలహీన వర్గాలని ఓటు బ్యాంకుగా చూడకుండా, వారి ఎదుగదల కోసం జగన్ కష్టపడుతున్నారని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చాలా గొప్పగా చెబుతున్నారు. బీసీల్లోని 139 కులాలకు గొప్ప అవకాశం కల్పించారని, బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు జగన్ ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని అంటున్నారు. అంటే బీసీలు జగన్ చెప్పినట్లు నడుచుకోవాలని మంచి సలహానే ఇచ్చారని, కానీ ఆ బీసీలకు ఈ రెండేళ్లలో ఏం చేశారో కూడా కాస్త చెబితే బాగుంటుందని, బీసీ వర్గాల నుంచే ప్రశ్నలు వస్తున్నాయి.
ఎప్పుడు లేని విధంగా 56 బీసీ కార్పొరేషన్లని ఏర్పాటు చేశారని, ఇది మంచి విషయమే అని అంటున్న బీసీ వర్గాలు, కానీ ఆ కార్పొరేషన్ల వల్ల తమకు ఒరిగిందేమీ లేదని ఫైర్ అవుతున్నారు. బీసీ కార్పొరేషన్లు పేరు గొప్ప ఊరు దిబ్బ అనే మాదిరిగానే ఉన్నాయని విమర్శిస్తున్నారు. ఆ బీసీ కార్పొరేషన్ల వల్ల ఇంతవరకు ఎంతమందికి బీసీలకు న్యాయం చేశారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. గతంలో కార్పొరేషన్ల ద్వారా బీసీలని ఆదుకునేవారని, సబ్సీడీ మీద లోన్లు ఇచ్చి బీసీలకు గత ప్రభుత్వాలు అండగా ఉన్నాయని, ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏ మేర అండగా నిలిచిందో చెప్పాలని అంటున్నారు.
ఇక బీసీల్లో ఉన్న ప్రతి కులానికి తమ వృత్తికి సంబంధించిన వస్తువులని అందించేవారని, కానీ ఇప్పుడు ఆ కార్యక్రమం జరగట్లేదని అంటున్నారు. ఏదో రెగ్యులర్‌గా వచ్చే సంక్షేమ పథకాలు మినహా, కొత్తగా వైసీపీ ప్రభుత్వం వల్ల బీసీలకు జరిగిన మేలు లేదని చెబుతున్నారు. అసలు 56 కార్పొరేషన్లకు ఎంత బడ్జెట్ కేటాయించారని, ఆ కేటాయించిన డబ్బులు బీసీలకు ఎంత ఖర్చు పెట్టారని అడుగుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే బీసీలకు జగన్ ప్రభుత్వం చేసింది శూన్యమని అంటున్నారు.
Discussion about this post